Download App

Chitrangada Review

టాలీవుడ్‌లో హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చాలా త‌క్కువ‌. ఉన్నా కూడా ప్రేక్ష‌కులకు ఆ సినిమాల‌ను రీచ్ చేసే రేంజ్ ఉన్న హీరోయిన్స్ ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే క‌న‌ప‌డ‌తారు. అందులో ఒక‌టి అనుష్క‌, న‌య‌న‌తార‌, అంజ‌లి వంటి హీరోయిన్స్ ముందు వ‌రుస‌లో ఉంటారు. గీతాంజ‌లి వంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రంతో స‌క్సెస్ కొట్టి, తాను కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డానికి రెడీ అనే సంకేతాల‌ను పంపిన హీరోయిన్ అంజలి. దీంతో అంజ‌లిని టైటిల్ పాత్ర‌దారిగా చేసి పిల్ల‌జ‌మీందార్ వంటి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు అశోక్ తెర‌కెక్కించిన సినిమా చిత్రాంగ‌ద‌. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమాలో అస‌లు చిత్రాంగ‌ద ఎవ‌రు? అంజ‌లి ఎలాంటి రోల్ చేసిందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

చిత్ర‌(అంజ‌లి) పారా నార్మ‌ల్ బిహేవియ‌ర్‌పై డాక్ట‌రేట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. సైకాల‌జీలో టాప్ స్టూడెంట్ కావ‌డంతో చిత్ర‌కు ఆమె చ‌దివిన కాలేజ్‌లోనే గెస్ట్ లెక్చ‌ర‌ర్ జాబ్ వ‌స్తుంది. అనాథ అయిన చిత్ర‌, స్టూడెంట్స్‌తో పాటు హాస్ట‌ల్లో ఉంటుంది. చిత్ర ఉండే హాస్ట‌ల్లో దెయ్యం తిరుగుతూ అంద‌రినీ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంటుంది. అంద‌రూ ఎవ‌రో ఆ దెయ్యం అని భ‌య‌ప‌డుతుంటే..చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ హాస్టల్లో అంద‌రినీ భ‌య‌పెడుతూ తిరుగుతుందని అమ్మాయిలు కాలేజ్ యాజ‌మాన్యానికి పిర్యాదు చేస్తారు. అదే స‌మ‌యంలో చిత్ర‌కు వ‌చ్చే ఓ క‌ల వ‌స్తుంటుంది. ఆ క‌ల‌లో ఎవ‌రో ఒక స్త్రీ, ఒక వ్య‌క్తిని చెరువులో చంపేయ‌డం చూస్తుంది. మాన‌సిక వైద్యుడు వ‌ద్ద‌కు వెళ్ళిన‌ప్పుడు చిత్ర ఈ విష‌యాన్ని డాక్ట‌రుకు చెబుతుంది. డాక్ట‌ర్ నీల‌కంఠ‌(జ‌య‌ప్ర‌కాష్‌) చిత్ర‌ను పిచ్చిదానివ‌ని తిట్ట‌డంతో చిత్ర త‌న క‌ల‌ను నిజం అని రుజువు చేయ‌డానికి అమెరికా బ‌య‌లుదేరుతుంది. అమెరికా వెళ్ళిన చిత్ర ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చిందా?  చిత్ర‌కు వ‌చ్చే క‌లలో నిజ‌మెంత‌? అస‌లు చిత్రలో మార్పులు క‌ల‌గడానికి కార‌ణ‌మెవ‌రు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

స‌మీక్ష:

ఇందులోముందుగా న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే...టైటిల్ పాత్ర‌లో న‌టించిన అంజ‌లి..న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిత్రాంగ‌ద పాత్ర‌లో త‌న పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి హండ్రెడ్ ప‌ర్సెంట్ ట్రైచేసింది. మంచి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచింది. మ‌గాడు అవ‌హించిన అడ‌వాళ్ళు ఎలా ప్ర‌వ‌రిస్తారో అలాంటి న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. దీప‌క్ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో చ‌క్క‌గా అభిన‌యించాడు. సింధుతులాని పాత్ర కాసేపే అయినా దీప‌క్ భార్య పాత్ర‌లో మెప్పించింది. ఇక రాజా ర‌వీంద్ర‌, జ‌య‌ప్ర‌కాష్, ర‌క్ష‌, సాక్షిగులాటి అంద‌రూ వారి వారి పాతల్లో న‌టించి మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. పిల్ల‌జ‌మీందార్ వంటి ఎమోష‌న‌ల్ సినిమా తీసిన అశోక్ హ‌ర్ర‌ర్ సినిమా చేయాల‌నుకోవ‌డం బాగానే ఉంది. అయితే పాత్ర‌ల్లో ఎమోష‌న‌ల్ వేవ్స్ లేకుండా ప్రెజెంట్ చేశాడు. అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా, దాన్ని తెర‌పై వంద‌శాతం ఆవిష్క‌రించ‌డంలో న్యాయం చేయ‌లేక‌పోయాడు. సెల్వ‌గ‌ణేష్‌, స్వామినాథ‌న్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పించ‌లేక‌పోయింది. బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్ సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌వీణ్‌పూడి త‌న‌కు వీలైన మేర సినిమాను షార్ప్ ఎడిట్ చేశాడు కానీ ఇంకాస్తా లెంగ్త్ త‌గ్గించి ఉంటే బావుండేద‌నిపించింది. పూర్వ‌జ‌న్మ‌లు, హ‌స్త‌రేఖా సాముద్రికం ప‌లు అంశాల‌ను ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ట‌చ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఇక నిర్మాణ విలువ‌లు బావున్నాయి. అశోక్ రాసిన డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డా మెరిశాయి. మొత్తం మీద హ‌ర్ర‌ర్ జోన‌ర్స్ సినిమాల‌ను అమితంగా ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు ఓసారి సినిమాను చూడొచ్చు.

బోట‌మ్ లైన్: చిత్రాంగ‌ద‌.. గ‌తి త‌ప్పిన హార్ర‌ర్ థ్రిల్ల‌ర్‌..

Chitrangada English Version Review

Rating : 2.5 / 5.0