Download App

Cine Mahal Review

సినిమా టాకీస్ చుట్టూ తిరిగే ఓ హ‌ర్ర‌ర్ కాన్సెప్ట్ ఆధారంగా తీసిన చిత్ర‌మే సినీ మ‌హల్‌. నిర్మాత‌లు కొంత‌మంది క‌లిసి డెబ్యూ డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌వ‌ర్మ‌తో తీసిన ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌లో న‌టించిన వారందరూ కూడా దాదాపు కొత్త‌వారే, ఒక‌రిద్ద‌రు మిన‌హాయిస్తే. ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ దృష్ట్యా హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకుందాం..

క‌థ:

ముర‌ళీ కృష్ణ ప్ర‌తాప్ అలియాస్ క్రిష్‌(అలీఖాన్‌) త‌న తాత క‌ట్టించిన కృష్ణ‌టాకీస్ బాగోగులు చూసుకుంటూ, అందులో మంచి సినిమాల‌ను ర‌న్ చేస్తూ వ‌స్తుంటాడు. అయితే తండ్రి చేసిన భారీ అప్పు క్రిష్‌ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. టాకీస్‌ల‌కు ప్రేక్ష‌కుల రాక త‌గ్గిపోవ‌డం, టాకీస్ ఉన్న స్థ‌లంపై అప్పు ఇచ్చిన వ్య‌క్తి(జెమిని సురేష్‌) క‌న్నేయ‌డం క్రిష్ ఇబ్బందిగా ఉంటుంది. ఆ స‌మ‌యంలో త‌న థియేట‌ర్‌కు సీన్ 13 అనే హ‌ర్ర‌ర్ సినిమాను తీసుకొస్తాడు. ఆ సినిమా వేసిన ప్ర‌తి షోకు కొంద‌రు చ‌నిపోతూ ఉంటారు. అస‌లెందుకు చ‌నిపోతున్నారో తెలియ‌క క్రిష్ టాకీస్‌ను మూసేసి, సినిమా గురించిన వివ‌రాల‌ను సేక‌రిస్తాడు. ఈ వివ‌రాల సేక‌ర‌ణ‌లో క్రిష్ బెంబేలెత్తిపోయే విష‌యం ఒక‌టి తెలుస్తుంది. అదే..సినిమాలో ప‌నిచేసిన అంద‌రూ చ‌నిపోవ‌డం. అస‌లు అంద‌రూ ఎందుకు చనిపోయార‌నే దానిపై క్రిష్ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టి కౌర‌వ‌కోన‌కు వెళ‌తాడు. అస‌లు కౌర‌వ‌కోన‌కు, సీన్ 13 సినిమాకు ఉన్న సంబంధం ఏమిటి? క‌్రిష్ చివ‌ర‌కు త‌న స‌మ‌స్య నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనే విష‌యాలు తెఉసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

స‌మీక్ష:

న‌టీన‌టుల ప‌రంగా చూస్తే...క్రిష్ పాత్ర‌లో న‌టించిన అలీఖాన్ చూడ‌టానికి బావున్నాడు. న‌ట‌న‌ప‌రంగా కూడా మంచి మార్కుల‌ను సంపాదించుకున్నాడు. మ‌రో హీరో సోహెల్ కూడా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. స‌త్య ఉన్నంత‌లో స‌న్నివేశాల ప‌రంగా కామెడిని క్రియేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ష‌క‌ల‌క శంక‌ర్ ఒక పాట‌లో క‌నిపించి మాయ‌మైయ్యాడు. గొల్ల‌పూడి మారుతీరావు, హీరోయిన్ తేజ‌స్విని పాత్ర‌లు ప‌రిమిత‌మ‌నే చెప్పాలి. వీరి న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ క‌న‌ప‌డ‌లేదు. ఇక టెక్నిషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే..ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌వ‌ర్మ ఫ‌స్టాఫ్ అంతా ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేసి దాన్ని చ‌క్క‌గా క్యారీ చేశాడు. ఇక సెకండాఫ్‌లో అస‌లు సీక్రెట్ రివీల్ చేశాడు. హీరో దెయ్యం భారి నుండి త‌న టాకీస్‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నాల‌తో న‌డిపించాడు. సెకండాఫ్‌ను ఇంకా ఆస‌క్తిక‌రంగా న‌డిపించి ఉండాల్సింది.శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అస్స‌లు బాలేదు. ట్యూన్స్ అంతంత మాత్రంగా ఉంటే, ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగ‌తి స‌రేస‌రి. దొరై సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎడిటింగ్ బాలేదు. సినిమాలో అన‌స‌ర స‌న్నివేశాల‌ను క‌త్తిరించి ఉంటే బావుండేద‌నిపించింది. స‌లోని సాంగ్‌ను మాస్ ఆడియెన్స్ ఎట్రాక్ష‌న్‌ను చేర్చినా, ఆ పాట వ‌చ్చే సంద‌ర్భం అతికిన‌ట్టు ఉంది.  ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టే హ‌ర్ర‌ర్ స‌న్నివేశాలు కానీ, విర‌గ‌బ‌డి న‌వ్వించే కామెడి స‌న్నివేశాలు లేవు. ద‌ర్శ‌కుడు ఆలోచ‌న బావుంది. కానీ దాన్ని క్యారీ చేసిన విధానంలో కాస్తా జాగ్ర‌త్తలు తీసుకుని ఉండుంటే బావుండేది...

బోట‌మ్ లైన్: సినీ మ‌హ‌ల్‌... మంచి కాన్సెప్ట్ బావుంది.. ప్ర‌య‌త్నంలో లోపం తిప్పికొట్టింది

Rating : 2.3 / 5.0