సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదు.. ‘సాక్షి’లో తప్పు రాశారు!

  • IndiaGlitz, [Tuesday,December 10 2019]

మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అధికారంలోకి వ‌చ్చాక అమ‌లు చేస్తామ‌ని చెప్పి ప్రజ‌ల‌ను ఓట్లడిగామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోలో స‌న్న బియ్యం ప్రస్తావ‌న ఎక్కడా లేదని.. కానీ ప్రతిప‌క్ష స‌భ్యులు మాత్రం లేని అంశాన్ని మేము చెప్పామ‌న్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. మంగళవారం నాడు ‘సన్న బియ్యం’పై అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే ఈ క్రమంలో సాక్షిలో వచ్చిన వార్తనే టీడీపీ సభ్యులు చూపించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. నాణ్యమైన బియ్యం, సన్న బియ్యం తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని అసెంబ్లీలో సీఎం స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పంపిణీ చేసిన బియ్యాన్ని ప్రజ‌లు తిన‌లేక‌పోతున్నారు కాబ‌ట్టే మేమొచ్చాక నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామ‌ని హామీ ఇచ్చామన్నారు.

సన్న బియ్యం అన్న పేరే లేదు!

ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టును మొద‌లుపెట్టామని.. ఏప్రిల్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌బోతున్నామని ఈ సందర్భంగా సీఎం క్లారిటీ ఇచ్చారు. దీనికోసం చంద్రబాబు క‌న్నా రూ. 1400 కోట్లు అధికంగా ఖ‌ర్చుచేయ‌బోతున్నామని.. ఈ బియ్యంలో డ్యామేజీ, నూక‌లు, త‌వుడు శాతాల‌ను భారీగా త‌గ్గించి క్వాలిటీ బియ్యం అంద‌జేస్తామన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ప్రజ‌లు బియ్యం అమ్ముకోవాల‌న్న ఆలోచ‌న ప‌క్కన‌పెట్టి సంతోషంగా తింటున్నారన్నారు. స్వర్ణ వెరైటీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో సన్న బియ్యం అనే పేరే లేదని.. ఫస్ట్ బియ్యం గురించి తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకోండని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మేనిఫెస్టో భగవద్గీత అని.. ప్రతి అంశాన్ని అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా మరోసారి జగన్ స్పష్టం చేశారు. సన్న బియ్యం అన్న పేరే లేదని.. స్వర్ణ రకాన్నే సన్న బియ్యం అంటారని జగన్ చెప్పుకొచ్చారు.