మీడియా ముందుకు కేసీఆర్!.. వరాలుండేనా?

  • IndiaGlitz, [Friday,July 17 2020]

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్ తెలంగాణను తాకిన తొలి నాళ్లలో ఆయన నాలుగు రోజులకొకసారి మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యాన్నిచ్చేవారు. కరోనా విజృంభించిన దగ్గర నుంచి ఆయన గాయబ్ అయ్యారంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. జూన్ 28న పీవీ శత జయంతి వేడుకల్లో కనిపించిన కేసీఆర్ అనంతరం మీడియా ముందుకు వచ్చింది లేదు. అసలు ఇటీవల ప్రగతి భవన్‌కు వచ్చే వరకూ కూడా ఆయనెక్కడ ఉన్నారో.. ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. విమర్శలు మరీ ఎక్కువవుతుండటంతో ఆయన సడెన్‌గా ప్రగతి భవన్‌కు వచ్చి వాటన్నింటికీ చెక్ పెట్టారు.

తాజాగా కురిసిన వర్షాలకు ఉస్మానియా ఉప్పెనైంది. అన్ని వార్డులకు నీళ్లొచ్చి.. పేషెంట్లు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇది చాలదన్నట్టు తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలు.. సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ఉస్మానియాలోకి నీళ్లొచ్చిన వీడియోలను పోస్టు చేసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. ఇక అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా వీటన్నింటినీ సమర్థించుకునే పరిస్థితి లేక డిఫెన్స్‌లో పడిపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ రంగ ప్రవేశం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తినప్పుడు సీఎం ఎంట్రీ ఇవ్వడం.. ఏవో ఒక వరాలు గుప్పించడం కామన్.

నేడు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడితో పాటు.. బాధితులకు అందుతున్న చికిత్స.. మెరుగైన చికిత్సకు చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు రావడమంటూ జరిగితే ప్రజలకు మేలు చేసే వరాలతోనే వస్తారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ.. ఉస్మానియా తదితర ప్రభుత్వాసుపత్రులకు వెళ్లడానికే ప్రజలు భయపడుతున్నారు. నిరుపేదలైతే తప్ప.. వీలైనంత వరకూ ప్రజలు కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. మరి దీనిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఏవైనా ప్రజలకు భరోసా ఇస్తారా? లేదంటే మరేదైనా వరంతో వస్తారా? అనే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.