కుర్చీ మడతపెట్టి చంద్రబాబును ఇంటికి పంపించారు.. సీఎం జగన్ పంచ్‌లు..

  • IndiaGlitz, [Monday,February 19 2024]

వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని సీఎం వైయస్ జగన్ తెలిపారు. 250 ఎకరాల విస్తీర్ణంలో రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెత్తందార్లతో యుద్ధానికి సిద్ధమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బటయే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లోనే జనం చొక్కాలు మడతపెట్టి, చంద్రబాబు కుర్చీలు 23కి మడతపెట్టారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి చంద్రబాబు కుర్చీలు మడతపెట్టాలంటూ జగన్ పిలుపునిచ్చారు.

బాబు వంచన, మోసాలు చూడలేక..

కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కాదని.. సంక్షేమ పథకాలు రద్దు చేయడమే టార్గెట్‌గా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు, మనకు మధ్య జరిగే యుద్ధం అని వెల్లడించారు. 1995, 1999, 2014 మేనిఫెస్టోలలో టీడీపీ ఇచ్చిన హామీలను కనీసం 10 శాతం అమలు చేయలేదంటూ జగన్ మండిపడ్డారు. బాబు వంచన, మోసాలు చూడలేక ప్రజలు ఆయన కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సంగతి అర్థమై 102 నుంచి 23 సీట్లకు తగ్గించారని.. మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.

బాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా..?

14 ఏళ్లు మూడు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందని సీఎం జగన్ ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు పేరు చెబితే అక్కాచెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని.. విద్యార్థులకు సైతం చంద్రబాబు పథకం ఒక్కటీ గుర్తురాదన్నారు. చంద్రబాబు కనీసం ఒక్క వర్గానికైనా మేలు చేశాడా అని ఆలోచిస్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదని పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చూస్తే ఏ ఒక్కగ్రామంలోనైనా చంద్రబాబు మార్క్ పాలన ఉందా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో విడుదల చేసే మేనిఫెస్టోల్లోని హామీలను నెరవేర్చడం ఆయనకు అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు తప్పా, ప్రజలకు అవసరమయ్యే పథకాలు ఏవీ లేవని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నో హమీలు అమలు చేశాం..

అదే మన ప్రభుత్వం వచ్చాక ‘2019లో అధికారంలోకి రాగానే రైతులకు రైతు భరోసా ఇచ్చాం. గ్రామ స్థాయిలో ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందించాం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాం. రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చింది వైసీపీ సర్కారే. 87 వేల కోట్ల రుణమాఫీని చంద్రబాబు ఓ మోసంలా మార్చారో రైతులందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో అక్కాచెల్లెమ్మలకు అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం. 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మహిళల రక్షణ కోసం దిశా పోలీస్ యాక్ట్. పిల్లలకు ఇంగ్లీష్ చదవులు తీసుకొచ్చాం అని వివరించారు. పెత్తందార్ల పిల్లలతో పేదల పిల్లలు పోటీ పడాలన్నా, ఇంగ్లీష్‌లో మాట్లాడాలన్నా మరోసారి జగన్ అధికారంలోకి రావాలని అప్పుడే పేదల పిల్లలకు ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

తోడేళ్లన్ని ఏకమవుతున్నాయి..

అందుకే మాట ఇచ్చి నిలబెట్టుకునే జగన్‌కు, ఇచ్చిన మాట తప్పే చంద్రబాబుకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వేరే రాష్ట్రంలో ఉండి అప్పుడప్పుడు ఏపీకి వచ్చే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు.. ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడి ప్రజల మధ్య ఉండే తమకు మధ్య జరగబోయే యుద్ధమే ఎన్నికలన్నారు. జగన్‌ను ఎదుర్కోవడానికి తోడేళ్లన్ని ఏకమవుతున్నాయని.. చంద్రబాబు, ప్యాకేజీ స్టార్, మీడియా అధిపతులు, జాతీయ పార్టీలు ఇలా అందరూ ఒక్కటవుతున్నారని తెలిపారు. కానీ తనకు సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ వెల్లడించారు.

More News

Peach Candy:పీచుమిఠాయి తింటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. నిషేధం విధించిన ప్రభుత్వం..

పీచు మిఠాయి అంటే మనకి చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తుంటాయి. చిన్నపుడు రోడ్లు మీద పీచు మీఠాయిని తెగ ఆరగించేవాళ్లం కదా.

Siddham: సీమలో వైసీపీ పొలికేక.. రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభకు 'సిద్ధం'..

'సిద్ధం' సభలతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. వైసీపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపారు.

Dangal Actress:చిత్ర పరిశ్రమలో విషాదం.. దంగల్ నటి కన్నుమూత..

హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్‌ ఖాన్‌ 'దంగల్‌' మూవీలో నటించిన బాలనటి సుహాని భట్నాగర్ కన్నుమూసింది.

Uttam: కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్య్ర భారతంలోనే అతి పెద్ద కుంభకోణం: ఉత్తమ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.

CM Revanth Reddy:అసెంబ్లీలో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.