కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: పద్మారావు
- IndiaGlitz, [Thursday,January 21 2021]
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పద్మారావు వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పద్మారావు, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పద్మారావు కాబోయే సీఎం అంటూ కేటీఆర్‌ను వ్యాఖ్యానించడమే కాకుండా శుభాకాంక్షలు సైతం తెలిపారు. కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న పెద్దలు.. కార్యక్రమానికి వచ్చిన జనాలు షాక్ అయిపోయి.. పద్మారావు వైపే చూడసాగారు.
ఇంకా పద్మారావు మాట్లాడుతూ.. శాసనసభ, రైల్వే కార్మికుల తరుఫున శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. కేటీఆర్ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నానని పద్మారావు పేర్కొన్నారు. ఇప్పటికే కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలకు బలమిచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం పద్మారావు ఏకంగా ‘కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు’ అని తెలిపారు. దీంతో కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది.
పైగా.. పద్మారావు వ్యాఖ్యలపై.. మంత్రి కేటీఆర్ ఎలాంటి అభ్యంతరమూ తెలపలేదు సరికదా.. ఆయన ప్రసంగంలో సైతం దీనిపై ఎలాంటి రియాక్షన్ రాలేదు. రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆఫీస్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని.. ప్రపంచంలోనే గొప్ప స్థితిలో రైల్వేస్ ఉండడానికి కార్మికుల, ఉద్యోగుల కృషే అని మాట్లాడారే కానీ ‘సీఎం’ అన్న వ్యాఖ్యలపై మాత్రం కేటీఆర్ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దీంతో కేటీఆర్ సీఎం పదవిని అలంకరించడానికి పెద్దగా సమయం పట్టదని తెలుస్తోంది. దాదాపు వచ్చే నెల ఆఖరు నాటికి ఆయన సీఎం అవడం ఖాయంగా కనిపిస్తోంది.