close
Choose your channels

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. ఇదే రిపీట్ ఐతే బీజేపీ పరిస్థితి?

Thursday, February 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నోట్ల రద్దు మొదలు.. నేటి వరకూ సామాన్యులపైనే భారం.. రోజువారీగా పెట్రోల్ ధరల మోత.. సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడికి వాత.. ఇక కనిపించిందల్లా ప్రైవేటు పరం.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేని కూడా ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు.. పలు బ్యాంకులు.. ఎల్‌ఐసీ.. విశాఖ ఉక్కు.. ఒకటేమిటి? అన్ని ప్రైవేటు పరం.. రైతుల గతి అధోగతి.. వ్యవసాయ చట్టాల పేరుతో కార్పోరేట్ సంస్థలకు పెద్దపీట.. అభివృద్ధి అట్టడుగుకు.. ఒకటేమిటి? బీజేపీ పాలన సమస్తం ప్రైవేటు పీడన పలాయనత్వం.. సామాన్యుడు కడుపు నిండా తినే పరిస్థితి లేదు.. పేదవాడు మరింత పేదరికంలోకి నెట్టబడుతుంటే.. ధనికులు మాత్రం మరింత ధనవంతులవుతున్నారు. ఇది జనం మనసుల్లో బలంగా నాటుకుంటోంది. దీంతో తొలి దెబ్బ బీజేపీపై పంజాబ్‌లో పడింది.

పంజాబ్‌లో ఇటీవల జిరగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నెల 7, 14 తేదీల్లో ఎన్నికలు జరగగా.. బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ విజయం రైతు ఆందోళనలకు మరింత బలాన్నిచ్చింది. ఇక్కడ బీజేపీ నాలుగో స్థానానికి పరిమితవ్వడం గమనార్హం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్ ఈ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రభావం చూపగలిగింది. అకాలీదళ్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఎనిమిది నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగగా.. మొత్తం ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

ఆకట్టుకునే ప్రసంగాలు విని..

2014లో ప్రధాని అభ్యర్థిగా మోదీ కరిష్మా, ప్రచారంలో ఆకట్టుకునే ప్రసంగాలు విని ఆయనే ప్రధాని కావాలని దేశ ప్రజానీకం బలంగా కోరుకుంది అలాగే ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. నల్లధనం, దొంగనోట్లు బయటకు తెస్తామంటూ ‘నోట్లరద్దు’కు రాత్రికి రాత్రే పూనుకుంటే దేశమంతా హర్షించింది. ఎన్నో ఇబ్బందులు.. ఎటీఎం క్యూలైన్లలోనే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినా సరే.. నోట్లరద్దుకు మద్దతు పలికారు. వ్యాట్ రద్దు చేసి దేశం మొత్తం ఒకే పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చారు. ఇంకేముంది రేట్లు అమాంతం తగ్గిపోతున్నాయని జనం సంతోషించారు. ధరలు తగ్గిన పాపాన పోలేదు సరికదా.. భారం మోయలేక ప్రజలే పోయే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం పైపైకి పోతున్నాయి. ఐఆర్‌సీటీసీ రైల్వే ప్రైవేటు పరం.

ఖలిస్తాన్ తీవ్రవాదులు, చైనా కమ్మీలు..

కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులన్నీ నార్మల్‌కి వచ్చినా నేటికీ రైళ్లను వదల్లేదు. దీనికి కారణం.. రైల్వేకు నష్టాలను అంటగట్టి ప్రైవేటు పరం చేయాలనే యోచన అని ప్రజలంతా భావిస్తున్నారు. హెచ్‌పీసీఎల్ ప్రైవేటు పరం.. బీఎస్ఎన్ఎల్‌ని ముంచి రిలయన్స్‌ని లేపారు. ఎల్ఐసీ ప్రైవేటు పరం.. పలు బ్యాంకుల ప్రైవేటు పరం.. వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల నడ్డి విరుస్తుంటే.. కడుపు మండిన అన్నదాత ఆందోళన చేస్తున్నారు. అంతటితో వారిని వదలక.. ఖలిస్తాన్ తీవ్రవాదులు, చైనా కమ్మీలు వీరికి ఫండింగ్ ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారని అపవాదు.. ఇవన్నీ పంజాబ్‌లో తీవ్ర ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది.

బీజేపీపై తీవ్ర వ్యతిరేకత..

త్వరలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ ఫలితం ఈ రాష్ట్రాల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. సామాన్యులను పాతాళానికి తొక్కేసి అంబానీ, ఆదానీలను పైకి లేపుతున్నారన్న ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. పరిస్థితులను చూస్తుంటే అదే నిజమని కూడా అనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ చేపడుతున్న పనులపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. కనీసం భక్తులు కూడా సమర్థించుకోలేని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోతోంది. ఇదే ఇంకా కొనసాగితే బీజేపీ మున్ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.