ప్రత్యక్ష రాజకీయాలకు జానారెడ్డి గుడ్‌‌బై

  • IndiaGlitz, [Monday,May 03 2021]

ప్రత్యక్ష రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గుడ్ బై చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి జానారెడ్డి ఎన్నో పర్యాయాలు విజయం సాధించారు. కానీ ఉప ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భగత్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గౌరవం కోసం నాగార్జునసాగర్‌లో పోటీ చేసినట్లు జానారెడ్డి తెలిపారు. ధర్మంతో, ప్రజాస్వామ్య విలువలతో ఎన్నికల్లో పాల్గొన్నానన్నారు. ఒక కొత్త ఒరవడిని తెద్దామని చేసిన విజ్ఞప్తిని పార్టీలు పట్టించుకోలేదని చెప్పారు.

Also Read: సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం

కరోనా పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని తెలిపారు. తన వారసుడిని పోటీకి పెట్టాలా లేదా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని జానారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రులు అంతా కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు యత్నించారన్నారు. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని ఈ ఎన్నికల్లో నిలబడి తమ పార్టీ సత్తా చాటిందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. కేవలం తమ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య 10 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. దీన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందేమీ లేదన్నారు.