close
Choose your channels

తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్

Friday, May 14, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు అంబులెన్స్‌లను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ గరిమళ్ల వెంకటకృష్ణరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా.. ఇదే అంశంపై నాలుగు రోజుల క్రితం కూడా పిటిషన్‌ దాఖలైంది.. పిటిషన్‌పై స్పందించి పోలీసులపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను ఆపితే కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ మళ్లీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: ‘లూసిఫర్’ అప్‌డేట్.. ఆయన తప్పుకోలేదట

హైకోర్టు అంబులెన్స్‌లను ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం రెండు రోజుల పాటు వాటికి సరిహద్దుల వద్ద లైన్ క్లియర్ అయింది. కాగా గురువారం తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో పోలీసులు సరిహద్దుల వద్ద అంబులెన్స్‌లను ఆపేస్తోంది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో బెడ్‌ కన్ఫర్మేషన్‌ పత్రం.. కంట్రోల్ రూమ్‌కు పంపితే ఈ-పాస్‌ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం ఈ-పాస్ ఉంటే మాత్రమే అంబులెన్స్‌ను తెలంగాణలోకి ప్రవేశానికి పోలీసులు అనుమతిస్తున్నారు. లేదంటే అక్కడి నుంచే తిప్పి పంపిస్తున్నారు.

పోలీసుల పరిస్థితి ఇదీ..

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పోలీసుల పరిస్థితి మారిపోయింది. అంబులెన్స్‌లను వదిలేస్తే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోదు. వదిలేయకుండా తిప్పి పంపితే కోర్టు చూస్తూ ఊరుకోదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పోలీసులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 0402465119, 9494438351 లకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి నుంచి అడ్మిషన్ ప్రపోజల్ లెటర్ ఉంటే, పేషేంట్‌ను తీసుకు వచ్చేందుకు కంట్రోల్ రూమ్ అనుమతులివ్వనుంది. కానీ అత్యవసర పరిస్థితిలో ప్రాణం కోసం అల్లాడుతూ తెలంగాణకు వచ్చేవారికి.. ఈ అనుమతులన్నీ తీసుకునే సమయం ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా ఇవన్నీ తీసుకుని వచ్చే వరకూ రోగి ప్రాణం నిలబడుతుందా? అనేది ప్రభుత్వానికే తెలియాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.