ఇండియాలో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

భారత్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరవవుతోంది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 32,695 కేసులు నమోదయ్యాయి.

ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 9,68,876 కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 606 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 24,915కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 3,31,146 యాక్టివ్ కేసులున్నాయి. 6,12,815 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. దేశంలో ప్రస్తుతం రికరవరీ రేటు 63 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా జులై 1 నుంచి ఇప్పటి వరకూ 3 లక్షల 83 వేల కేసులు నమోదవడం గమనార్హం.