కరోనా వ్యాప్తి దృష్ట్యా అమర్ నాథ్ యాత్ర రద్దు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసులు సంఖ్య మాత్రం ఊహించని రీతిలో పెరిగిపోతుండటంతో కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తోంది. మరోవైపు రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటూ అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. అమర్‌ నాథ్ యాత్ర విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీ అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు (SASB) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. బుధవారం నాడు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, SASB ఛైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము నేతృత్వంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా జూన్ 23 నుంచి ఆగస్టు 03 వరకూ అమర్‌నాథ్ యాత్ర జరగాల్సి ఉండగా తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. యాత్ర సాగే మార్గాల్లో 77 రెడ్ జోన్లు ఉండటంలో భక్తులు కరోనా వైరస్ బారినపడే ప్రమాదముందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.