కరోనా ఎఫెక్ట్ : ఫ్లాట్ ఫాం టికెట్ ధర భారీగా పెంపు

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా రద్దీగల ప్రాంతాల్లో, గుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఉంది. ఇప్పటి వరకూ ఉన్న 10 రూపాయిలను 50కు పెంచడం జరిగింది. ఈ పెరిగిన టికెట్ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా రద్దీగా, గుంపులుగా ఉండే ప్రాంతం గనుక దీన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఏసీ బోగీల్లో కర్టెన్లు తొలగిస్తున్నామని, వీటిలో ప్రయాణికులకు దుప్పట్లు కూడా తాము అందించబోమని భారతీయ రైల్వే ప్రకటించింది.