close
Choose your channels

ప్రజల మధ్యే కరోనా బాధితులు.. తెలంగాణలో సర్వం అస్తవ్యస్తం

Saturday, July 25, 2020 • తెలుగు Comments

తెలంగాణ పరిస్థితి సర్వం అస్తవస్త్యంగా మారుతోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణం. టెస్టులు తక్కువే.. ట్రేసింగూ లేదు.. ట్రీట్‌మెంట్ అంతంత మాత్రమేనన్న ఆరోపణలు వినబడుతున్నాయి. టెస్టింగ్ సెంటర్ల వద్ద జనం బారులు తీరుతున్నాయి. కానీ సిబ్బంది కొరతతో ఒక్కో టెస్టింగ్ సెంటర్ వద్ద 50 కంటే ఎక్కువ టెస్టులు జరగట్లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక జరిగిన టెస్టులకూ వెంటనే రిపోర్ట్స్ ఇవ్వడం లేదు. నాలుగైదు రోజులు పడుతున్నాయి. రిపోర్ట్ వెంటనే కావలంటే రూ.వెయ్యి రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాంటాక్ట్‌లోకి రాని బాధితులు 3 వేల మందికి పైనే...

మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ప్రజల మధ్యే తిరుగుతూ తమ పనులను నిర్వర్తిస్తున్నారని తెలుస్తోంది. ట్రేసింగ్ చేయలేమంటూ అధికారులు సైతం చేతులెత్తేశారు. రాంగ్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లను ఇచ్చి అధికారులను బాధితులు తప్పుదోవ పట్టిస్తున్నారు.మరికొందరు
హోం ఐసోలేషన్‌లో సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఒకవేళ నంబర్ కరెక్టుగా ఇచ్చినప్పటికీ స్విచ్ ఆఫ్ చేసుకుని కరోనా బాధితులు బయట తిరుగుతున్నారని తెలుస్తోంది. 3 వేల మందికి పైగా కరోనా రోగులు కాంటాక్ట్‌లోకి రాలేదని సమాచారం.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు దారితీసే అవకాశం..

కరోనా సోకిందని చెబితే ఎక్కడ అపార్ట్‌మెంట్‌ల్లోకి రానివ్వరని కొందరు.. అద్దెకుండేవారైతే ఇంటి ఓనర్లతో తంటా అని.. బయటకు తెలిస్తే ఇరుగుపొరుగు వారు తమను వెలివేసినట్టు చూస్తారని ఇంకొందరు భయపడుతూ బాధితులు బయటకు తెలియనివ్వడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు 40 వేలకు చేరుకున్నాయి. ఇంకా అసలు లెక్కలు తేలని కేసులు ఎన్నో ఉన్నాయి. బాధితులు ఇలా బయటకు చెప్పకుండా సాధారణ వ్యక్తుల్లా తిరగడం కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌కు దారి తీస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz