కార్పొరేట్‌ వర్గాలకు కేంద్రం భారీ ఊరట.. స్టాక్ మార్కెట్‌కు రెక్కలు!

  • IndiaGlitz, [Friday,September 20 2019]

ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టింది. దేశీయ కంపెనీలు, కొత్త ఉత్పత్తి సంస్థలకు కార్పోరేట్ పన్నులను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ అమలులో ఉన్న కార్పోరేట్ టాక్స్‌ను 30 నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆర్థిక మంత్రి.. కొత్త ఉత్పత్తి సంస్థల పన్ను రేటును 25 నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆదాయపుపన్ను చట్టానికి సవరణలు చేసేందుకు త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పారు. అయితే.. ఓ షరతును కూడా విధించడం జరిగింది. ఈ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభించవని.. అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త కంపెనీలకు ట్యాక్స్‌ను 15 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. దీంతో, కొత్త కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ 17.01 శాతంగా ఉండబోతోంది.

స్టాక్ మార్కెట్లకు శుభవార్త..!

కార్పోరేట్ రంగానికి ఊరట కల్పిస్తూ ఆర్ధిక మంత్రి ప్రకటన చేయగానే మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 1,669 పాయింట్లు ఎగబాకి 37,764 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 480 పాయంట్ల లాభంతో 11,181కి పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఉన్న 30 కంపెనీలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి 10 శాతం పైగా లాభాల్లో దూసుకోపోతోంది.

మొత్తానికి చూస్తే.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలను చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా, దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా... దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించడం విశేషమే