జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 

  • IndiaGlitz, [Monday,November 30 2020]

హోరాహోరీగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఒక పార్టీ స్ఫూర్తిగా తీసుకోవడం.. మరో పార్టీ గుణపాఠంగా తీసుకోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆయా పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అగ్ర నాయకత్వాన్ని దింపి మరీ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 1న పోలింగ్, 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రధానాంశాలను వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ముద్రించిన బ్యాలెట్ పత్రాలు 81,88,686 కాగా.. ప్రతి సర్కిల్‌కు ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్టు తెలిపింది. పోలింగ్ పర్యవేక్షణకు 661 మంది జోనల్ అధికారులను ఈసీ నియమించింది. 60 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లు.. పోస్టల్ బ్యాలెట్ల కోసం 2,629 మంది దరఖాస్తు చేశారని తెలిపింది. బ్యాలెట్ పేపర్‌లో చివరన నోటా గుర్తును ఉంచినట్టు ఈసీ వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలుకు 19 ప్రత్యేక బృందాలను నియమించింది. గడువు తర్వాత ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని వెల్లడించింది. బయటి వ్యక్తులు జీహెచ్‌ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌లో ఇప్పటి వరకు 1.70 లక్షల పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్టు వెల్లడించింది. ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040-29555500ను సంప్రదించాలని తెలిపింది. కోవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని వెల్లడించింది. మాస్క్‌ ధరించాలని.. శానిటైజర్‌ వాడాలని.. భౌతికదూరం పాటించాలని తెలిపింది. లక్షా 20 వేల పీపీఈ కిట్లు సిద్ధం చేశామని వెల్లడించింది. ఇప్పటికే 92 శాతం పోలింగ్ చీటీల పంపిణీ పూర్తి అయిందని ఈసీ తెలిపింది.

మొత్తం 150 డివిజన్లకు జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 1122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ 150 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలపగా.. బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106 డివిజన్లలో పోటీకి దిగాయి. ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, స్వతంత్ర అభ్యర్థులుగా 415 మంది పోటీ చేస్తున్నారు. ఇక గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీలో 74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రచారం పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వానికి ఆయా పార్టీలు తెరతీశాయి. తమ పార్టీల గెలుపు కోసం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఓటరు ఆనందమే పరమావధిగా దూసుకెళుతున్నాయి. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో అంత్యంత ఆసక్తికరంగా మారాయి. మరి ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాలి.

More News

సింగర్ సునీత పెళ్లిపై మళ్ళీ గుసగుసలు

టాలీవుడ్‌లో సునీత ప్రముఖ సింగర్‌గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ బలాబలాలివే..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది.

ఐదేళ్లయ్యింది.. ఏం చేసావో చెప్పు?: కేసీఆర్‌పై అమిత్ షా ఫైర్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్సీ కవితకు బండ్ల గణేష్ కౌంటర్..

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేరును ప్రస్తావిస్తూ.. బండి సంజయ్.. ఆయనకు మించిన కమెడియన్ అయ్యారని కేసీఆర్ తనయురాలు..

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి - ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల

సినిమా థియేటర్లు రీ-ఓపెనింగ్‌తో పాటు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం