బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు షాక్.. కోర్టు జరిమానా

  • IndiaGlitz, [Tuesday,March 16 2021]

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా జరిమానా విధించింది. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహించిన జిల్లా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ 25 నెలల క్రితం పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్‌లో సినిమా చూసేందుకు ‘బుక్ మై షో’ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాడు. అతనికి ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జీలు రూ.41.78తో కలిపి టికెట్ ధర రూ.341.78 పడింది.

టికెట్ ధరపై సుమారు 18 శాతం వసూలు చేయడమేంటంటూ సెంట్రల్ కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీకి 2019 జనవరి 18న ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సైతం ఆశ్రయించాడు. దీనిపై వాదోపవాదనలు జరిగిన మీదట సుమారు 26 నెలల అనంతరం తీర్పు వెలువడింది. అయితే ఫిర్యాదు దారు చెప్పినవి నిరాధారమైనవంటూ కేసును కొట్టివేయాలని బుక్ మై షో సంస్థ కోర్టును కోరింది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 అధ్యక్షుడు నిమ్మ నారాయణ, కమిషన్ సభ్యురాలు లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ విచారణ జరిపి వినియోగదారుల వాదనలతో ఏకీభవించింది.

టికెట్ ధరపై రూ.6 అదనంగా వసూలు చేసుకోవచ్చని బుక్‌మై షో, పీవీఆర్ సినిమాస్‌కు వివాదాల పరిష్కార కమిషన్ వెల్లడించింది. అలాగే విజయ్ గోపాల్‌కు రూ.25 వేల పరిహారం.. కేసు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాలంటూ తీర్పును వెలువరించింది. అలాగే లీగల్ ఎయిడ్ కింద రూ.5 వేలను కోర్టుకు చెల్లించాలని బుక్‌మై షో, పీవీఆర్ సినిమాస్‌ను ఆదేశించింది. ఈ కేసులో కోర్టు మరో ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఈ డబ్బులన్నింటినీ 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని.. లేనిపక్షంలో తీర్పు వెలువడిన సమయం నుంచి 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.