close
Choose your channels

Deccan Mall : దక్కన్ మాల్ కూల్చివేత.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం, తప్పిన పెను ప్రమాదం

Wednesday, February 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేటలోని దక్కన్ మాల్‌లో ఇటీవల భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చిక్కుకుపోయారు.. వీరిలో ఒకరి అస్థిపంజరాన్ని గుర్తించగా, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల పాటు భవనం మంటల్లో చిక్కుకుపోవడంతో భవంతి పూర్తిగా దెబ్బతింది. చుట్టుపక్కల నివాసాలు సైతం ప్రమాదం బారినపడే అవకాశం వుండటంతో దక్కన్ మాల్‌ను కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఓ కంపెనీకి టెండర్ కేటాయించారు. నాలుగు రోజుల క్రితం బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. పొడవైన జేసీబీ లాంటి యంత్రంతో ఈరోజు బిల్డింగ్ కూల్చివేస్తుండగా పెను ప్రమాదం తప్పింది. ఆరు అంతస్తుల ఈ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే సమీప భవనాల్లోని జనాన్ని ముందే ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. తర్వాత శిథిలాలను వేరే ప్రాంతానికి తరలించనున్నారు.

జనవరి 19న దక్కన్ మాల్‌లో అగ్నిప్రమాదం:

ఈ నెల 19న దక్కన్‌ మాల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. రెండ్రోజులైనా లోపల వేడి తగ్గకపోవడంతో సహాయక సిబ్బంది లోపలికి ప్రవేశించలేకపోయారు.మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతినడంతో దీనిని జీహెచ్ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ భవనం నాణ్యత లోపించడం కారణంగా దీనిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు.

ఒకసారి టెండర్ రద్దు చేసిన జీహెచ్ఎంసీ:

మొత్తం రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. రూ.25.94 లక్షలకు కూల్చివేత నిర్వహిస్తామని ఎస్‌కె మల్లు కన్‌స్ట్రక్షన్స్ గత బుధవారం టెండర్ దక్కించుకుంది. ఆ తర్వాతి రోజు ఉదయమే యంత్ర సామాగ్రితో దక్కన్ మాల్ వద్దకు చేరుకుంది. భారీ క్రేన్‌తో కంప్రెషర్ యంత్రాన్ని భవనం పైకి తీసుకెళ్లి .. క్రేన్‌తో పట్టి వుంచి భవనాన్ని కూల్చివేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనికి జీహెచ్ఎంసీ అధికారులు ఒప్పుకోలేదు. వెంటనే వారి కాంట్రాక్ట్‌ను రద్దు చేసి మాలిక్ ట్రేడర్స్ అనే సంస్థకు రూ.33 లక్షలకు అప్పగించారు. జీహెచ్ఎంసీ అధికారుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న మాలిక్ ట్రేడర్స్.. గత గురువారం రాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించింది.

ఆ అస్థిపంజరం ఎవరిది :

ఇక భవనంలో దొరికిన అస్థిపంజరం ఎవరిదన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ సిబ్బంది, క్లూస్ టీం సభ్యులు ఎముకల డీఎన్ఏను పరీక్షల నిమిత్తం గాంధీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అయితే ఈ ఎముకలు ఒకరివా, ఇద్దరివా, ముగ్గరివా అన్నది క్లారిటీ రావాల్సి వుంది. ఆ రోజు భవనంలో విధుల్లో వున్న కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అధికారులు సేకరించారు. డీఎన్ఏ రిపోర్ట్ తర్వాతే దీనిపై సందిగ్థం వీడనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.