మోదీతో దీదీ భేటీ.. పేరు మారుతుందా!?
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ కలిశారు. బుధవారం సాయంత్రం ప్రధాని నివాసానికి వెళ్లిన దీదీ.. మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకుపైగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతీ ఏడాదిలాగే.. ఈసారి కూడా కుర్తా, స్వీట్లు కానుకగా ఇచ్చారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పేరును బంగాల్‌గా మార్చే అంశంపై కీలకంగా చర్చించారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని దృష్టికి దీదీ తీసుకెళ్లారు.
జశోదాకు దీదీ చీర!
కాగా అంతకుముందు.. ఢిల్లీకి బయలుదేరే సమయంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ భార్య జశోదాబెన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా.. జోశాదాకు చీరను దీదీ గిఫ్ట్‌గా ఇచ్చారు. బెంగాల్లో పుణ్యక్షేత్రాల సందర్శన ముగించుకొన్న జశోదాబెన్ విమానాశ్రయానికి వస్తుండగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
సమస్యలు విన్నపం!
ఈ సందర్భంగా దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగాయన్నారు. పశ్చిమ బెంగాల్ పేరును బంగాల్‌గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరానన్నారు. నిరుద్యోగం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని.. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి రాష్ట్ర సమస్యలను వివరిస్తామన్నారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బొగ్గుగని ‘డోచా పచామిని’ మీ చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా మోదీని ఆహ్వానించినట్లు దీదీ మీడియాకు వెల్లడించారు.
అసలేం జరుగుతోంది!
ఇదిలా ఉంటే.. మోదీపై ఎప్పుడూ ఒంటికాలిపై లేచే దీదీ సడన్‌గా ఎందుకిలా మారిపోయారన్న విషయం రాజకీయ విశ్లేషకులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. మోదీ ప్రధాని అంటే తాను ఒప్పుకోనని.. మోదీని ఓడించడానికి.. బహిరంగ సభా వేదికగా ఆమె చేసిన విమర్శనాస్త్రాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అదేదో సామెత ఉంది కదా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరన్న విషయం దీదీ-మోదీని బట్టి చూస్తే మరోసారి అక్షరాలా నిజమవుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదేమో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.