బ్రేకింగ్: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌.. ఆసక్తికర విషయాలు!

  • IndiaGlitz, [Friday,December 06 2019]

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి దగ్గరే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వి.. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు. కాగా ఈ ఘటన దిశ ఘటన జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో చోటుచేసుకుంది. పోలీస్‌కస్టడీకి తీసుకున్న రెండో రోజే నిందితులు ఎన్‌కౌంటర్‌‌కు గురయ్యారు.

అంతకుమించి న్యాయం..!

కాగా.. ఈ ఘటనపై యావత్ సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ మీడియా.. సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై బాధితురాలి తల్లిదండ్రులు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని.. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని.. అంతకు మించి న్యాయం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన మా కూతురు తిరిగిరాదని..
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఎప్పుడెప్పుడు ఏం జరిగింది!?

కాగా.. గత నెల 27న దిశపై అత్యాచారం, హత్య జరిగింది. 28న మధ్యాహ్నం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 29న షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణకు తీసుకున్నారు. 30న నలుగురు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 4న నిందితులను కోర్టు.. పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది. 5న చర్లపల్లి జైలులో నిందితులను సిట్‌ విచారించింది. ఈ క్రమంలో నిందితులు ఇచ్చిన సమాచారంతో పాతిపెట్టిన దిశ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే అనగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడం.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం జరిగిపోయింది.

నాడూ.. నేడూ!

కాగా.. నాడు వరంగల్‌లో యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులు కూడా సేమ్ టూ సేమ్ ఘటన జరిగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న వేళ... 2008, డిసెంబర్ 10న వరంగల్ లో స్వప్నికపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న స్పప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతలపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్‌ తో దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో దిశను హత్య చేసిన చోట సీన్ రీకన్‌ స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను విచారిస్తున్న వేళ, వారంతా పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నాడు స్వప్నిక, నేడు దిశ... ఈ రెండు ఘటనల్లోనూ సజ్జనార్ దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అయితే అప్పట్లో సజ్జనార్ కీలక పదవిలో ఉన్నారు. నేడు షాద్‌నగర్ ఘటన జరిగినప్పుడూ సీపీగా సజ్జనార్‌ ఉన్నారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న సజ్జనార్ పరిశీలించారు.