యడియూరప్ప కేబినెట్ ఏర్పాటైన గంటల్లోనే అసంతృప్తి సెగలు

  • IndiaGlitz, [Tuesday,August 20 2019]

కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారంనాడు కొత్త కేబినెట్ ఏర్పాటైన విషయం విదితమే. బీజేపీ ఎమ్మెల్యే బి.శ్రీరాములు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేష్ సహా 17 మంది కేబినెట్ మంత్రులుగా.. గవర్నర్ వాజూభాయ్ వాలా సమక్షంలో ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అయితే మంత్రివర్గం ఏర్పాటైన కొన్ని గంటలకే సీనియర్ల నుంచి యడ్డీకి తలనొప్పి మొదలైంది. ఈ ప్రమాణ స్వీకారానికి సొంత పార్టీకి చెందిన ఉమేష్ కట్టి, మురుగేష్ నిరాని, బాలచంద్ర జార్కిహోలి, రేణుకాచార్య, బసవరాజ్ పాటిల్ యత్నాల్ వంటి సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. సీనియర్లుగా ఉంటూ.. పార్టీకోసం అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ తమకు కేబినెట్‌లో చాన్స్ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి ఆ సీనియర్ల ప్రమాణంకు హాజరుకాలేదని తెలుస్తోంది.

ప్రమాణ స్వీకారం చేసింది వీరే..
గోవింద్ మక్తప్ప కరజోల్
డాక్టర్ అశ్వథ్ నారాయణ్ సీఎన్
లక్ష్మణ్ సంగప్ప సవడి
కెఎస్.ఈశ్వరప్ప
ఆర్.అశోక
జదదీష్ షెట్టార్
ఎస్.సురేష్ కుమార్
వి.సోమన్న
సీటీ రవి
బసవరాజ్ బొమ్మై
కోట శ్రీనివాస్ పూజారి
జేసీ మధు స్వామి
చంద్రకాంత గౌడ
ప్రభు చౌహన్
జె శశిఖళా అన్నాసాహెబ్

యడ్డీపై గరం.. గరం!
ఇదిలా ఉంటే.. మంత్రుల జాబితా తనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించిందని కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడిన చిత్రదుర్గ బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను ఒకట్రెండు కాదు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు.. చిత్రదుర్గలో తిప్పారెడ్డి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలతో హోరెత్తించారు.

ఇలా ఒకరిద్దరు కాదు.. చాలా మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా తిరుగుబాటు చేస్తే కన్నడనాట బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా లేదా అన్నది అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. మంత్రివర్గం ఏర్పాటైన కొన్ని గంటల్లోనే ఇలా వివాదాలకు తావివ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే కేంద్రం పంపిన జాబితా ప్రకారమే ఇవాళ ప్రమాణం జరిగిందని తెలుస్తోంది.. మరి ఈ వ్యవహారంపై యడ్డీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.