ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం.. భారతీయులకే అధిక నష్టం

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘హైర్‌ అమెరికన్‌’ నినాదంలో భాగంగా విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్‌1-బీ, ఎల్‌1, ఓపీటీలపై ఆంక్షలు విధించటానికి సిద్ధమయ్యారు. దీని ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించి తద్వారా వారి మెప్పు పొందేందుకు యత్నిస్తున్నారు. కరోనా వ్యాప్తితో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరిందని అంచనా. కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి సైతం మందగించింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతి ఇవ్వటం చాలా కష్టం.. వారికి ప్రభుత్వమే ఉపాధి కల్పించాల్సిన అత్యవసర పరిస్థితి. ఈ నేపథ్యంలో విదేశాలకు చెందిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించి అమెరికా పౌరులకు ఉపాధి కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు నిన్నటితో ముగిశాయి. దీంతో కొత్త ఆదేశాల జారీకి ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. దీనిలో భాగంగానే ట్రంప్ సర్కార్ హెచ్‌1-బీ, ఎల్‌1, జే1, ఓపీటీలపై దృష్టిపెట్టింది.

భారతీయులకే ఎక్కువ నష్టం..

అయితే ఈ నిర్ణయం తాత్కాలికమే అయినా.. అమెరికా వీసా జారీ వ్యవస్థలో శాశ్వత మార్పులు ఉంటాయని శ్వేత సౌధం అధికారులు పేర్కొన్నారు. కేవలం టాలెంట్ ఉన్నవారు మాత్రమే అమెరికాలో కాలుపెట్టేలా కొత్త నిర్ణయాలు ఉండొచ్చని చెప్పారు. అయితే జే1 వీసాలపై వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ హెచ్‌1-బీ, ఎల్‌1, ఓపీటీలపై అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. అమెరికాకు చెందిన క్యాట్‌ ఓ ఆర్గ్‌ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ఇండియాకు చెందిన 4 లక్షల మంది హెచ్‌1-బీ వీసాపై.. లక్ష మంది ఎల్‌1 వీసాలపై అమెరికాకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. అమెరికా ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీటిలో దాదాపు 70 శాతం భారతీయ ఐటీ నిపుణులకే దక్కుతాయి. ట్రంప్ తాజా నిర్ణయం వీరిపై ప్రభావం చూపనుంది.