ఒక గొప్ప స్టార్ ను కోల్పోయాము : డా. కే.ఎల్. నారాయణ

  • IndiaGlitz, [Monday,February 26 2018]

శ్రీదేవి లాంటి గొప్ప స్టార్ తో "క్షణక్షణం" చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానూ, గర్వాంగానూ ఉండేదని, అయితే ఆమె హఠాత్తుగా మృతి చెందడం భారతీయ సినిమా రంగానికే తీరని లోటని నిర్మాత డా.కే.ఎల్.నారాయణ చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మ్రిత్రుడు ఎస్ గోపాల్ రెడ్డితో రూపొందించిన సినిమాలో శ్రీదేవిని నాయికగా ఎంపిక చేసుకున్నామని, అప్పటికే ఆమె పెద్ద స్టార్ అని నారాయణ తెలిపారు. తాము కొత్త నిర్మాతలమైనా అలాంటి భావన ఎప్పుడూ శ్రీదేవి వ్యక్తం చేయలేదని, చాలా గౌరవంగా ఉండేదని, ఏ సందర్భంలో కూడా మాకు అసౌకర్యం కలిగించలేదని, నంద్యాలలో షూటింగు చేసినప్పుడు పబ్లిక్ తో చాలా కష్టంగా ఉండేదని, అయినా శ్రీదేవి ఎంతో సహకరించిందని నారాయణ చెప్పారు.

ఆ చిత్రం షూటింగు జరుగుతూ ఉండగా వారి నాన్నగారు చనిపోయారని, అయినా ఆ బాధను కనబడనీయకుండా షూటింగులో పాల్గొనడం నిజంగా ఆమె గొప్ప మనసుకు నిదర్శనమని నారాయణ చెప్పారు. " "క్షణక్షణం" చిత్రంలో ఆమె నటనకు నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చినందుకు అప్పట్లో తామెంతో సంతోషపడ్డామని నారాయణ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమని, నటిగా ఎన్ని శిఖరాలు అధిరోహించినా వినమ్రంగా ఉండే మనస్తత్వమని నారాయణ చెప్పారు. శ్రీదేవి మృతికి ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.