close
Choose your channels

Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఈడీ దాడులు... హైదరాబాద్‌లోనూ తనిఖీలు

Tuesday, September 6, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం హైదరాబాద్ సహా ఆరు రాష్ట్రాల్లోని 30కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అక్కడి ప్రభుత్వాధికారుల ఇళ్లపై మాత్రం ఎలాంటి దాడులు చేపట్టలేదని సమాచారం. హైదరాబాద్ విషయానికి వస్తే.. ప్రేమ్ సాగర్, అభిషేక్ రావు, సృజన్ రెడ్డిలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఇందులోని మనీలాండరింగ్ విషయంగా ఈడీ రంగంలోకి దిగింది.

అసలేం జరిగిందంటే :

2021 నవంబర్‌లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు వున్నాయని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక ఇచ్చారు. టెంటర్ల విధానంలో కొందరికి లబ్ధి కలిగేలా నిర్ణయాలు వున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా .. నిజానిజాలు తేల్చాల్సిందిగా సీబీఐని కోరారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. రాష్ట్రంలో అబ్కారీ శాఖకు ఇన్‌ఛార్జీగా వున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాదు గత నెల 19న సిసిడియా నివాసంలో సోదాలకు సైతం దిగడం దేశంలో సంచలనం సృష్టించింది.

అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు వున్నాయంటూ బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపణలు చేయడం ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఘాటుగా స్పందించిన కవిత.. బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా కూడా వేశారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనను ఇరికించాలని కుట్ర పన్నారంటూ కవిత ఆరోపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ దాడులు జరగడం కలకలం రేపుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.