close
Choose your channels

Karnataka:కర్ణాటక ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, తొలిసారిగా ‘‘ఓట్ ఫ్రమ్ హోమ్‌’’ విధానం

Wednesday, March 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దక్షిణాదిలో వున్న కీలక రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఏప్రిల్ 20.. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 24గా నిర్ణయించారు. ఇవాళ్టీ నుంచే కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

తొలిసారిగా ‘‘ఓటు ఫ్రమ్ హోమ్’’:

ఇక భారత ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా ‘‘ఓటు ఫ్రమ్ హోమ్’’ విధానాన్ని కర్ణాటక నుంచే ఈసీ అమలు చేయనుంది. దీని ప్రకారం.. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయంతో ఇంటి నుంచే ఓటు వేయొచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈసీ నిర్ణయంతో కర్ణాటకలోని 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది వికలాంగులకు ప్రయోజనం కలగనుంది. అంతేకాదు.. అక్కడ 16,976 మంది వందేళ్లకు పైబడిన ఓటర్లు వున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కర్ణాటకలోని మొత్తం ఓటర్ల సంఖ్య 5.21 కోట్లు.. వీరిలో పురుషులు 2.62 కోట్లు.. మహిళలు 2.59 కోట్లు. ఎన్నికల నిమిత్తం మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ గడువు మే 25తో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది సభ్యుల బలం వుంది.

కుప్పకూలిన సంకీర్ణ సర్కార్.. బీజేపీ చేతికి పగ్గాలు :

2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ ప్రభుత్వాని ఏర్పాటు చేసింది. అయితే అసెంబ్లీలో బలనిరూపణలో విఫలం కావడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్, జేడీఎస్‌లు కుమారస్వామి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే తర్వాతి ఏడాదికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో మరోసారి యడ్యూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వయసు, తదితర కారణాలతో యడ్డీని సీఎంగా తొలగించిన కమలనాథులు ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైకీ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతుండగా.. ఎట్టిపరిస్ధితుల్లో కాషాయానికి ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్‌లు తొలి జాబితాను సైతం విడుదల చేశాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.