కేసీఆర్‌కు ఊహించని షాక్.. ఈ నెల 23 తర్వాత..!

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సుమారు రెండు వారాలుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గమంటుంటే.. కేసీఆర్ మాత్రం మెట్టు దిగేది లేదని మొండికేసి కూర్చున్నారు. అయితే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని చెబుతూనే.. అసలు ఏం చేయబోతున్నామనే విషయం మాత్రం ప్రభుత్వం చెప్పట్లేదు. దీంతో.. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఆర్టీసీ కార్మికులు నిత్యం ఆందోళనలతో హడావుడి చేస్తుండటం కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

తాజాగా.. కేసీఆర్‌కు విద్యుత్ ఉద్యోగులు కూడా ఊహించని షాకివ్వడానికి సిద్ధమవుతున్నారు. డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు విఫలమవ్వడంతో సమ్మె చేపట్టాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23 తర్వాత మెరుపు సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది.

కాగా.. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. 1999 ఫిబ్రవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈపీఎఫ్ విధానం కూడా అమలుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమ్మె విషయంలో కేసీఆర్ ఏం చేస్తారో.. అనేది తెలియాల్సి ఉంది.