close
Choose your channels

బద్ధ శత్రువులు కలిశారు.. ఇద్దరిలో గెలిచి నిలిచేదెవరు..?

Sunday, February 10, 2019 • తెలుగు Comments

బద్ధ శత్రువులు కలిశారు.. ఇద్దరిలో గెలిచి నిలిచేదెవరు..?

అవును వాళ్లిద్దరూ కలిసిపోయారు.. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను పక్కనపెట్టేసి ఒక్కటైపోయారు. అయితే ఒక్కటయ్యారు సరే ఏ మాత్రం సక్సెస్ అవుతారన్నది ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్న  విషయం. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులుండేవి. ఆది టీడీపీలో చేరడం.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో ఇరువురి మధ్య మరిన్ని విబేధాలు పుట్టుకొచ్చాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇద్దరూ టికెట్ల కోసం పోటాపోటీగా సీఎం చంద్రబాబుకు వద్దకు వెళ్లారు. అయితే పార్టీ మారిన వారు కాగా.. మరొకరు పార్టీలో ఏళ్ల తరబడి జెండా మోస్తున్న వ్యక్తి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని చంద్రబాబు సుమారు నెల రోజుల పాటు వరుస పంచాయితీలు పెట్టి ఫైనల్‌‌గా మంత్రి ఆదిని కడప పార్లమెంట్ నుంచి.. రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో వీరిద్దరి పరిస్థితి ఎలా ఉంది..? రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది..? అనేది ఇప్పుడు చూద్దాం.

మంత్రి ఆది విషయానికొస్తే...

ఇప్పటికే రెండు సార్లు కాంగ్రెస్ తరఫున.. ఒక సారి వైసీపీ తరఫున గెలిచిన ఆది నారాయణరెడ్డి.. వైసీపీని వీడి సైకిలెక్కి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే త్వరలో జరగనున్న ఎన్నికల్లో కడప పార్లమెంట్ తరఫున పోటీ చేయిస్తున్నారు. అయితే కడప జిల్లా వైఎస్ జగన్ సొంత జిల్లానే కాదు కంచుకోట అనే విషయం విదితమే. జమ్మలమడుగులో అటు ఆది.. ఇటు రామసుబ్బారెడ్డి వర్గీయులు, అనుచరులు, కార్యకర్తలందరూ కలిస్తే అసెంబ్లీ గెలుస్తామని.. తద్వారా లోక్‌సభ సీటును కూడా గట్టెక్కచ్చనే భావనతో బాబు ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ కుటుంబానికి ఒకట్రెండు కాదు ఏకంగా 5లక్షలపైగా మెజార్టీ వచ్చింది. అంతేకాదు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన వైఎస్ అవినాశ్ రెడ్డికి 1,90,323 ఓట్ల మెజార్టీ వచ్చింది. పోనీ ఇద్దరూ రెడ్డీసే గనుక మెజార్టీ తగ్గితే కాస్తో కూస్తో తగ్గొచ్చుగానీ వైసీపీ ఓడే పరిస్థితే లేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఇవన్నీ అటుంచితే ఇక్కడ్నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన గుర్రుమని ఉన్నారు. ఈయన ఎంత మాత్రం మద్దతిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఎలాగో ఈ సీటుకు మనకు రాదనే ఆది సోదరుడికి చంద్రబాబు.. ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని టాక్ నడుస్తోంది.

రామసుబ్బారెడ్డి విషయానికొస్తే..

1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన అప్పట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రెండు ఎన్నికల్లో గెలిచిన ఆయనకు తర్వాత అన్నీ గడ్డు రోజులే. అప్పట్లో పార్టీ మారతారని కూడా పుకార్లు వచ్చాయి కూడా. అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు.. రామసుబ్బారెడ్డిని శాంతపరిచారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఈయన వరుసగా రెండు సార్లు గెలిచినప్పటికీ పోటీచేస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి 12,167 ఓట్ల తేడాతో ప్రస్తుత మంత్రి ఆది పైనే ఓడిపోయారు. అయితే ఈసారి కచ్చితంగా రామసుబ్బారెడ్డిదే గెలుపని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదెలాగంటే ప్రత్యర్థులిద్దరూ ఒక్కటవ్వడం వల్ల ప్లస్ అవుతుందని.. అంతేకాకుండా ఇద్దరి కేడర్, కార్యకర్తలు కలిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా 1999 నుంచి ఓడినప్పటికీ పోటీచేస్తుండటంతో ప్రజల్లో అదో సెంటిమెంట్ రగిలిస్తుందని కూడా రామసుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇక్కడ్నుంచి వైసీపీ తరఫున పోటీచేయబోయే అభ్యర్థి సుధీర్ రెడ్డికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందిగానీ ఇంత వరకెన్నడూ కనీసం కార్పొరేటర్‌‌గా పనిచేయలేదు. పైగా వైసీపీలో గత కొన్ని రోజులు గ్రూపు తగదాలు చోటుచేసుకున్నాయని.. తాజాగా కొన్ని రాజకీయ పరిణామాలు టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మొత్తానికి చూస్తే.. ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి సత్తా చాటడానికి సిద్ధమవుతుండగా.. మరొకరు హ్యాట్రిక్ కొట్టి మరోసారి మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారన్నమాట. అయితే వీరి ప్రయత్నాల్లో ఎవరు సక్సెస్ అవుతారు..? ఎవరు ఇంటికి పరిమితమవుతారు..? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.