‘రేపట్నుంచి తెలంగాణలో కరోనా కేసులుండవేమో!’

రేపట్నుంచి అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఉండకపోవచ్చేమోనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం మీడియా ముందుకొచ్చిన ఆయన.. రేపట్నుంచి కొత్త కేసులు రాకపోవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్-22 నాటికి ప్రస్తుతం ఉన్న వాళ్లంతా కోలుకుని దిశ్చార్జ్ అవుతారన్నారు.

మంత్రి ఈటల మాటల్లోనే..

ఇదిలా ఉంటే.. తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కు చేరుకుందని మంత్రి తెలిపారు. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయని మీడియాకు వెల్లడించారు. ఇవాళ కరోనాతో ఒకరు చనిపోయారని మంత్రి అధికారికంగా వెల్లడించారు. ఈ మరణంతో కలిపి ఇప్పటి వరకూ మొత్తం రాష్ట్రంలో 12 మంది కరోనాతో చనిపోయారు. తెలంగాణలో కరోనాతో కోలుకుని 45మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 414.

ఇవాళ ఒక్కరోజే 665 శ్యాంపిల్స్‌లో 18 మాత్రమే పాజిటివ్ వచ్చాయని.. బహుశా రేపట్నుంచి కొత్త కేసులు రాకపోవచ్చుని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. ఇది లేకుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. హాట్ స్పాట్ ప్రకటించిన ప్రాంతాల్లో రాకపోకలు బంద్ చేస్తున్నట్లు మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు.