కొత్త పార్టీపై ఈటల స్పందన.. అప్పుడు తమ్ముణ్ని.. ఇప్పుడు దెయ్యాన్నా?

అప్పుడు నా తమ్ముడు అని చెప్పుకున్నారు కదా.. ఇప్పుడు ఆ తమ్ముడు దెయ్యం అయ్యాడా? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. నేడు ఆయన మీడియా ముందుకు వచ్చి తనపై వచ్చిన ఆరోపణలపై, భవిష్యత్ కార్యచరణపై మాట్లాడారు. నాడు నయీం గ్యాంగ్ తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని అప్పుడే తాను భయపడలేదని.. ఇప్పుడు భయపడతానా? అని అన్నారు. సాగర్‌లో కేవలం కేసీఆర్ ప్రచారం వల్లే గెలవలేదన్నారు. కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని ఈటల పేర్కొన్నారు.

Also Read: వానతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమి

పార్టీ పెట్టే ఆలోచనే లేదు..

పార్టీ భీఫామ్ ఉంటే కాదు.. ప్రజల ఆమోదం ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. నాకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉంది. పార్టీ పెట్టే ఆలోచన లేదు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. నాపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి. ఏమాత్రం తప్పున్నా నన్ను శిక్షించండి. ఉద్దేశ పూర్వకంగానే నాపై తప్పుడు రాతలు రాశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగింది. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే. జమున హ్యాచరీస్‌లో నేను డైరెక్టర్‌ను కాను. ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశా. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదు.

పథకం ప్రకారమే నాపై కుట్ర

సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశాను. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశాను. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించాను. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదు.
గత మూడ్రోజులుగా నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పథకం ప్రకారమే నాపై కుట్ర. వేల కోట్లు సంపాధించానని దుష్ప్రచారం చేస్తున్నారు. నా లాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారు. జమున హ్యాచరీస్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారు. కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే. సంబంధం లేని భూములను నాకు అంటగడుతున్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కాను అని ఈటల పేర్కొన్నారు.