close
Choose your channels

Ex CM Kiran Kumar:బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ

Saturday, March 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు. కానీ ఆయన ప్రయత్నం వృథా ప్రయాసే అయ్యింది. చివరికి తెలుగు నేల రెండు ముక్కలు కావడంతో సీఎం, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఆయన.. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయినప్పటికీ మౌనంగానే వుంటున్నారు.

త్వరలో బీజేపీ పెద్దలతో భేటీ కానున్న కిరణ్ :

మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లారి ఫ్యామిలీ రాజకీయాల్లో మరోసారి యాక్టీవ్ కావాలని భావిస్తోంది. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో క్రియాశీలకంగానే వున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తారు. ఈ క్రమంలో కిరణ్ కూడా ఆలోచనలో పడ్డారు. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్లీ కోలుకునే అవకాశం లేకపోవడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామన్న హామీ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కిరణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం వుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇటీవల బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ :

ఇదిలావండగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు ఒంటెత్తు పోకడలు అవలంభిస్తున్నారని, అందరితో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వెళతూ వెళుతూ కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు వైఖరి నచ్చకే తాము బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు , విష్ణువర్థన్ రెడ్డి మినహా చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరూ లేరు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కనుక కాషాయ తీర్ధం పుచ్చుకుంటే ఏపీ బీజేపీలో సమీకరణాలు మారే అవకాశం వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.