close
Choose your channels

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇకలేరు..

Saturday, August 24, 2019 • తెలుగు Comments

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇకలేరు..

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆగస్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. సుమారు 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను బతికించాలని వైద్యులు సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. జైట్లీ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

రాజకీయ ప్రవేశం..!
అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ ఢిల్లీ నుంచే డిగ్రీ మరియు న్యాయశాస్త్ర పట్టా పొందినారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా కల మంత్రిగా నియమించబడ్డారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ట్రబుల్ షూటర్‌గా..
ఇదిలా ఉంటూ.. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఈ ఏడాది జనవరిలో రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. దీంతో బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలక మంత్రిగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఆయనకు క్యాన్సర్ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

జైట్లీ సంస్కరణలు
కాగా.. మోదీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. జైట్లీ హయాంలోనే కీలకమైన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది.

షా పర్యటన రద్దు..!
కేంద్ర మంత్రి అమిత్ షా.. శనివారం నాడు హైదరాబాద్‌లో పర్యటనలో ఉన్నారు. అయితే అరుణ్ జాట్లీ మరణ వార్తతో హుటా హుటిన పర్యటన రద్దు చేసుకున్న షా ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయారు.

Get Breaking News Alerts From IndiaGlitz