మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలింపు

  • IndiaGlitz, [Tuesday,May 10 2022]

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్‌లోని ఆయన నివాసానికి వచ్చిన చిత్తూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలిస్తున్నారు.

ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నాలు పత్రాలు లీకైన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ విద్యాసంస్థల సిబ్బంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అన్ని మార్గాల వరకు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు నారాయణ అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణ అరెస్ట్ జరిగిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా నారాయణను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. పేపర్ లీకేజ్ ఎక్కడా జరగలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారని.. లీకేజీ కేసులో నారాయణను ఎందుకు అరెస్ట్ చేశారని అచ్చెన్న ప్రశ్నించారు.