close
Choose your channels

బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట.. నవరత్నాలతో వెలుగులు!

Wednesday, July 10, 2019 • తెలుగు Comments

బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట.. నవరత్నాలతో వెలుగులు!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికే మొదటి సారి అసెంబ్లీ సమావేశాలు జరగ్గా.. గురువారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సభలు 14 రోజుల పాటు జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జరిపిన బీఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు నిధుల కేటాయింపుల గురించి రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్టెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతుకు ముందు ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2019-20 సంవత్సారినికి సంబంధించి ప్రవేశ పెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత ముసాయిదా బిల్లులపై చర్చ కొనసాగుతుంది.

బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏమేమి చేస్తామని మాటిచ్చారో అవన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు. రైతులకు వడ్డీలేని పంట రుణాల హామీని నెరవేరుస్తోంది. పగటి పూట 9 గంటల ఉచిత కరెంటు అందించేందుకు చర్యలు చేపట్టింది. 2014 నుండి 2019 వరకూ అంటే గత ప్రభుత్వ హాయాంలో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు రూ.7లక్షలు నష్టపరిహారం అందించేందుకు సిద్ధమౌతోంది. అంతేకాకుండా.. రేపటి బడ్జెట్ లో రైతు పథకాలకు భారీగా కేటాయింపులు జరగనున్నాయని తెలుస్తోంది.

నవరత్నాలతో వెలుగులు

మద్యపాన నిషేధం, పించన్లు, డ్వాక్రా రుణ మాఫీ, అమ్మ ఒడి ఇలా నవరత్నాల్లోని ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వాల తీరుగా కాకి లెక్కలతో కాదు, ప్రతిపథకానికీ ప్రయోజనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బెల్టు షాపులకు అల్టిమేట్టం జారీ అయ్యింది. ఇక మద్యం దుకాణాల టెండర్లు 18% పడిపోయాయి. విచ్చలవిడిగా మద్యం లభించకుండా టైమ్ కటాఫ్ విధిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం నష్టం జరిగినా ప్రజారోగ్యమే ప్రగతి మార్గం అని నమ్మిన ముఖ్యమంత్రి వల్లే ఇది సాధ్యం అవుతోంది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులకే కాదు ఇంటర్ విద్యార్థులకు సైతం అమ్మ ఒడి వర్తింపచేశారు. ముఖ్యమంత్రి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పింఛన్ వయసు తగ్గించడం, కొత్త పింఛన్లు సాంక్షన్ చేయడం జరుగుతోంది. నిరుద్యోగ భృతిని కూడా మూడు రెట్లు చేసి వారికి అండగా నిలచారు వైఎస్ జగన్. నవరత్నాల పథకాలకు కేటాయించే బడ్జెట్‌పై కూడా పూర్తి అవగాహనతో  ఆర్థిక మంత్రి ఉన్నారు.
 
విపక్షానికి అవకాశం

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల మైకులు కట్ చేసి ప్రజావాణిని వినిపించకుండా కట్టడి చేసిన చీకటి రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు.. సభలో అందరూ చూశాం కూడా. కానీ నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సభా సాంప్రదాయాలకు పెద్ద పీటవేస్తోంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి జరిపిన బీఏసీ సమావేశంలో ప్రతిపక్షానికి ప్రశ్నించేందుకు, చర్చించేందుకు కోరినంత సమయం ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

కుళ్లిపోయిన రాజకీయవ్యవస్థను కడిగేస్తా!

దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో ఈ కుళ్లిపోయిన రాజకీయవ్యవస్థను కడిగేస్తానని పాదయాత్రలో జగన్ పదేపదే చెప్పిన మాట ఇది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్, నెలరోజుల పాలనలోనే ఎన్నెన్నో మార్పులకు శ్రీకారం చుట్టి.. అందరూ ఆశించినట్టే నవశకానికి నాంది పలికారని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz