Kejriwal:అవినీతిపై పోరాడి.. చివరకు అదే ఆరోపణలతో అరెస్టై.. కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..

  • IndiaGlitz, [Friday,March 22 2024]

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్ కావడం గమనార్హం. 16 ఆగస్టు, 1968న హర్యానాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో కేజ్రీవాల్ జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం 1989లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. 1992లో ఆ ఉద్యోగం మానేసి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో జాయింట్ కమీషనర్ ఉద్యోగంలో చేరారు.

1999లో రెవెన్యూ సర్వీసులో ఉండగానే పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిపించేవారు. ఈ క్రమంలోనే 2006లో ఆయన చేసి కృషికి రామన్ మెగసెసే పురస్కారం లభించింది. తన సహచర ఉద్యోగి సునీతను వివాహమాడిన తర్వాత ఆయన పూర్తి కాలం అవినీతిపై పోరాడాలని నిర్ణయించుకుని తన పదవికి రాజీనామా చేశారు. అక్కడి నుంచి సామాజిక కార్యకర్త అన్నాహజారే వెంట ఉంటూ అవినీతిపై పోరాటానికి తన వంతు ప్రయత్నం చేశారు.

2006లో పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు. 2010 నుంచి అన్నాహజారేతో కలసి జన్‌ లోక్‌పాల్ బిల్లుకోసం ఉద్యమం చేశారు. అప్పుడే కేజ్రీవాల్ పేరు దేశమంతా తెలిసింది. అయితే రాజకీయాలతోనే అవినీతిని రూపుమాపవచ్చని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో అన్నాహజారేతో కూడా విభేదించి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. సామాన్యులు, యువత, మేధావులను తన పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో అనేక మంది ఉన్నత విద్యావంతులు, అధికారులు, యువత పార్టీలో చేరారు.

2013 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ 28 సీట్లను గెలిచింది. అయితే మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసి తొలిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జన్ లోక్‌పాల్ బిల్లు శాసనసభలో ఆమోదం పొందకపోవడంతో కేవలం 49 రోజులకే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి ఎంపీగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై కేజ్రివాల్ పోటీ చేసి ఓడిపోయారు.

2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుంధుబి మోగించారు. 70 స్థానాలకు 67 స్థానాల్లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 62 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. తర్వాత పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లోనూ పోటీ చేసి ప్రత్యేక ఓటు బ్యాంకును సంపాదించుకుని ఆప్ జాతీయ పార్టీగా నిలిచింది.

ఢిల్లీ సీఎంగా తన పదేళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పేదలకు విద్య, వైద్యం అందించాలని అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అయితే 2021లో తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానం ఆయన మెడకు చుట్టుకుంది. లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. మద్యం వ్యాపారుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా ముడుపులు అందాయని ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. దీంతో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసే సత్యేంద్ర జైన్‌, మరికొంతమంది జైలు పాలయ్యారు. చివరకు ఆయన కూడా అరెస్ట్ కావలం కలకలం రేపింది. అవినీతిపై పోరాడి మంచి పేరు తెచ్చుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

More News

Kavitha:సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇవ్వడం కుదరదన్న ధర్మాసనం..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

Kejriwal:కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

Drug Container:వైజాగ్‌లో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌తో టీడీపీ నేతలకు లింకులు..?

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో

TDP:టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Tamilisai:ఎంపీగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే..?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎంపీగా పోటీ చేసే స్థానం ఖరారైంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో