ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఇక లేరు..

  • IndiaGlitz, [Thursday,November 26 2020]

అర్జెంటైనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు. 60 సంవత్సరాల మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే చికిత్స చేయించుకున్నారు. మెదడుకు శస్త్ర చికిత్స అనంతరం రెండు వారాల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. కాగా.. బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఊబకాయంతో పాటు కొకైన్ వాడకం వలన అనేక అనారోగ్య సమస్యలను మారడోనా ఎదుర్కొంటున్నారు. మారడోనా మృతికి అర్జంటీనా ప్రభుత్వం మూడు సంతాప దినాలుగా ప్రకటించింది.

నిరుపేద కుటుంబంలో పుట్టిన డిగో.. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. నాలుగుసార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న మారడోనా 1986లో అర్జెంటైనాకు ప్రపంచ కప్ అందించారు. 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి ఏడాదిన్నరపాటు నిషేధానికి గురయ్యారు. 1997లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్జెంటైనా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. అర్జెంటీనా వాసులు సాకర్‌ను బీభత్సంగా ప్రేమిస్తుంటారు. దీంతో మారడోనాను గోల్డెన్ బాయ్‌గా పిలుస్తారు. ఎడమ పాదాన్ని బలమైన ఆయుధంగా చేసుకుని గోల్ఫ్ చేస్తుంటాడు. మారడోనా ఆట తీరును అంచనా వేయడమనేది ప్రత్యర్థులకు పెను సవాల్‌గానే ఉండేది.

1991లో డోపింగ్ కుంభకోణం ఆయన కెరీర్‌కు చాలా పెద్ద దెబ్బగా పరిణమించింది. ఆ సమయంలో తాను కొకైన్‌కు అలవాటు పడినట్టు మారడోనా అంగీకరించాడు. ఈ కుంభకోణం ఆయనను తను రిటైర్ అయ్యేవరకూ వెంటాడిందనే చెప్పాలి. ఈ కొకైన్ వాడకం కారణంగా హృదయ సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారు. కొకైనే తనకు చాలా పెద్ద ప్రత్యర్థి అని ఒకానొక సందర్భంలో మారడోనా తెలిపాడు. విపరీతంగా బరువు పెరగడం కూడా ఆయన ఆరోగ్యానికి ఇబ్బందికరంగా పరిణమించింది. 2005లో ఆపరేషన్ ద్వారా బరువు తగ్గించుకున్నారు. 2001లో ఫిఫా.. పీలేతో పాటు డిగోను సైతం ఫుట్‌బాల్ చరిత్రలో మేటి ఆటగాడిగా ప్రకటించింది.