విషమంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే చికిత్సానంతరం కూడా ప్రణబ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు మంగళవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరేందుకు వెళితే ముందుగా వైద్యులు కరోనా టెస్టు నిర్వహించారని దానిలో తనకు పాజిటివ్ వచ్చిందని ఇటీవల ట్విట్టర్ వేదికగా ప్రణబ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అప్పటికి వారం ముందు నుంచి తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని.. వారు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు.
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రణబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.