Download App

Gatham Review

రోనా టైమ్‌లో సినీ ప్రేక్షకులకు ఓటీటీ మాధ్యమాలే ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధనాలుగా మారిపోయాయి. ముఖ్యంగా సినిమాల విడుదల విషయంలో స్టార్స్‌ సినిమాలు కొన్నే విడుదలైనా, ఓ మోస్తరు సినిమాలు, చిన్న బడ్జెట్‌ చిత్రాలు బాగానే విడుదలైయ్యాయి. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'గతం'. ట్రైలర్‌ చూస్తే సినిమా ఆసక్తికరంగా, థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌గా అనిపించింది. అంతా కొత్తవారితో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా?  లేదా? అనే విషయం తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం...

కథ: 

రిషి(రాకేష్‌) ఓ రోడ్డు ప్రమాదంలో గతాన్ని మరచిపోయుంటాడు. ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఉంటాడు. రిషి లవర్‌ అదితి(పూజిత) అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది.  ఓరోజు అతనికి స్పృహ వస్తుంది. కానీ యాక్సిడెంట్‌ వల్ల అతను గతాన్ని మరచిపోయుంటాడు. దాంతో అదితి అతన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఇద్దరు కారులో ప్రయాణిస్తుంటారు. దారి మధ్యలో కారు బ్రేక్‌ డౌన్‌ అవుతుంది. ఇంతలో అదే దారిలో వెళుతున్న వ్యక్తి వారికి లిఫ్ట్‌ ఇస్తాడు. అయితే ఆ వ్యక్తి తమను టార్గెట్‌ చేశాడని రిషి, అదితికి అర్థమవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? రిషి, అదితిని ఎందుకు టార్గెట్‌ చేశాడు? రిషికి ఎందుకు యాక్సిడెంట్‌  జరిగింది? కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

సమీక్ష:

నిశ్శబ్దం, రీసెంట్‌గా విడుదలైన మిస్‌ ఇండియా తర్వాత అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం గతం, ఈ మూడు చిత్రాలు ఓటీటీలోనే విడుదల కావడం మరో విశేషం. అమెరికాలో ఉన్న ఐటీ నిపుణులందరూ కలిసి అక్కడి లొకేషన్స్‌ అయిన లేక్‌ థోయ్‌, సెయ్‌రా నెవాడ, మంచుతో నిండిన అడవులు వంటి వాటిలో ఈ సినిమాను చిత్రీకరించారు. సినిమా మేకింగ్‌ వేల్యూస్‌ బావున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ క్లారిటీతో బాగా అనిపించింది. థ్రిల్లర్‌ సినిమాలో ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేస్తే చాలు.. సక్సెస్‌ అయినట్లేనని చెప్పవచ్చు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఇక నటీనటుల విషయానికి వస్తే రిషి పాత్రలో నటించిన రాకేష్‌ చక్కగా చేశాడు. అతని వాయిస్‌ విజయ్‌ దేవరకొండ స్టైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక హీరోయిన్‌ పూజిత కూడా చక్కగా నటించింది. మంచి పాత్రలు దొరికితే మరింత పేరు వచ్చే అవకాశాలున్నాయి. సినిమాకథలో భాగంగా వచ్చే ట్విస్టులు, టర్న్‌లు బావున్నాయి. డీసెంట్‌గా ఎండింగ్‌ ఉంది. అయితే కథనం లాజిక్స్‌ మిస్‌ అయినట్ల స్పష్టంగా తెలుస్తుంది. కొత్త నటీనటులు కాబట్టి కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఇంకాస్త బాగా తీసుండొచ్చు అని అనిపించింది.

బోటమ్‌ లైన్‌: గతం..  ఓకే అనిపించే సైకలాజికల్‌ థ్రిల్లర్‌

Read Gatham Movie Review in English

Rating : 2.8 / 5.0