BiggBoss: మీ అంత వేస్ట్‌గాళ్లు ఏ సీజన్‌లో లేరు.. బయటకు పోండి , కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఆగ్రహం

  • IndiaGlitz, [Wednesday,October 19 2022]

గత సీజన్‌లతో పోలిస్తే బిగ్‌బాస్ 6 ప్రజల్ని ఏమాత్రం ఆకట్టుకోవడం లేదన్న సంగతి తెలిసిందే. ఊరూ పేరు లేని కంటెస్టెంట్స్, పాత చింతకాయపచ్చడిలాగే అవే టాస్కులు, గొడవలు, గేమ్‌లు . ఏళ్లుగా చూస్తూనే వున్న ప్రేక్షకులకు బొత్తిగా మొహం మొత్తేసింది. ఇక వీకెండ్‌లో నాగార్జున వచ్చే ఎపిసోడ్‌ల సంగతి సరేసరి. గతంలో ఆయన వచ్చే రెండు రోజులూ ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోయేవారు కానీ ఇప్పుడా పరిస్ధితి లేదు. దీంతో జనానికి చిరాకు వచ్చి దాని ఎఫెక్ట్ బిగ్‌బాస్ టీఆర్‌పీలపైనా పడింది. ఒకానొక సందర్భంలో నాగార్జున సైతం కంటెస్టెంట్స్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జనం మెచ్చే కంటెంట్ రావడం లేదని వరుసగా అందరికీ గడ్డిపెట్టారు. కానీ ఇంటిలో అదే వాతావరణం. ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు షాకిచ్చారు. ఈ షో పట్ల ఆసక్తి లేకపోతే.. మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చంటూ తేల్చిచెప్పారు. అంతేకాదు.. డోర్లు కూడా ఓపెన్ చేశాడు. దీంతో షాక్ అవ్వడం ఇంటి సభ్యుల వంతైంది. బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తిపరచాలో తెలియక ఇంటి సభ్యులు జుట్టుపీక్కుంటున్నారు.

అసలేం జరిగిందంటే.. నామినేషన్ల తంతు ముగియడంతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపికకు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ‘‘సెలబ్రెటీ గేమింగ్ లీగ్’’ ఇచ్చారు . ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించి... కొందరికి లేటెస్ట్ సినిమాల్లోని పాత్రలను, మరికొందరికి పాత సినిమాల్లోని క్యారెక్టర్లను ఇచ్చారు. సూర్య పుష్పరాజ్, గీతూ శ్రీవల్లి, రేవంత్ ఘరానా మొగుడులో చిరంజీవి, శ్రీహాన్ చెన్నకేశరెడ్డిలో బాలకృష్ణ, ఇనయా జగదేకవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవి, బాలాదిత్య భీమ్లా నాయక్, శ్రీ సత్య ఫిదాలో సాయి పల్లవి, వాసంతి బొమ్మరిల్లు హాసిని, ఆదిరెడ్డి కూలీ నెంబర్ 1లో హీరో, ఫైమా నరసింహలో నీలాంబరి, మెరీనా జేజమ్మ, రోహిత్ మగధీర, కీర్తి రాములమ్ములుగా వేషాలు ధరించారు. ఎవరు ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తారో వారే కెప్టెన్సీ పోటీదారులని బిగ్‌బాస్ చెప్పాడు.

అయితే ఇంటి సభ్యులు టాస్క్ మీద శ్రద్ధ చూపకుండా... కొందరు ఆటను ఏమాత్రం పట్టించుకోలేదు. గీతూ, సూర్యలు పుష్పరాజ్, శ్రీవల్లిలాగా బాగానే నవ్వించినా మిగిలిన వారంతా జోకులేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ వచ్చారు. మరికొందరు గొడవపడ్డారు. ఆ గొడవల కారణంగా టాస్కులో వున్న సంగతి కూడా చాలా మంది మర్చిపోయారు. చాలాసేపు ఎంటర్‌టైన్ చేయకపోవడం వల్ల బిగ్‌బాస్‌కు కాలిపోయింది. ఈ వారమైనా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామనుకున్నా ఇలా చేస్తున్నారంటూ వెంటనే బెల్ మోగించారు.

అందరినీ గార్డెన్ ఏరియాలో పిలిచి వరుసగా నిల్చోబెట్టాడు. ఇప్పటి వరకు ఏ సీజన్‌లో ఇలాంటి వేస్ట్ గాళ్లని చూడలేదని... మీకు ఫుడ్డూ... బెడ్డూ వేస్ట్ అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఏ సీజన్‌లోనూ ఇంత చప్పగా సాగలేదని... ప్రేక్షకులను, నన్ను చాలా నిరాశపరిచారంటూ క్లాస్ పీకాడు. వినోదాన్ని పంచేందుకు ఎవరూ సిద్ధంగా లేరని.. ఆసక్తి లేనివాళ్లు ఇంటిని వీడి వెళ్లిపోవచ్చని చెబుతూ... మెయిన్ డోర్లు ఓపెన్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌ని రద్దు చేస్తున్నామని.. సెలబ్రిటీలు కాస్ట్యూమ్స్‌ని విప్పేయాలని ఆదేశించాడు. అలాగే ఈవారం ఇంటికి కెప్టెన్ వుండడనిన చెప్పారు. ఇంటి సభ్యులు ఎంతగా బతిమలాడినా బిగ్‌బాస్ మాత్రం తగ్గేదే లే అంటూ కూర్చొన్నాడు.

అయితే ఇంటి సభ్యులు అందరినీ ఒకేగాటున కట్టేయకుండా.. ఫైమా, సూర్య , గీతూ, రేవంత్, శ్రీహాన్, రాజ్‌, కీర్తి, బాలాదిత్యలు ఎంతోకొంత న్యాయం చేసేందుకు కాంప్లిమెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్. క్షమాపణలు చెబుతూ.. ఆటను కొనసాగించాలని వారు కోరారు. కానీ బిగ్‌బాస్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో కంటెస్టెంట్స్ చాలా ఫీలయ్యారు. ఈ తతంగం సద్దుమణిగాక.. బిగ్‌బాస్ తిట్టింది.. తమను కానట్లే ప్రవర్తించారు కొందరు. శ్రీహాన్ ఏకంగా కెమెరా దగ్గరకెళ్లి.. బిగ్‌బాస్ అంటే ఏంటో కొందరికి చెప్పాలంటూ కోరాడు. కొందరు చేసిన తప్పుల వల్ల అందరిపై ఎఫెక్ట్ పడుతుందంటూ వాదించాడు.

మరి ఈవారం కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ రద్దు చేశాడు... హౌస్‌మేట్స్ ఏం చేస్తారు... షోను ఎలా ముందుకు తీసుకెళ్తాడు. ఈవారం కూడా సూర్యనే కెప్టెన్‌గా కొనసాగుతాడా..? లేదంటే ఏదైనా కండీషన్ వుంటుందా..? బిగ్‌బాస్ మనసు మార్చుకుంటాడా అంటూ ప్రేక్షకులు ఎగ్జయిట్‌గా ఎదురుచూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

More News

అల్లు అరవింద్‌ని ఆ వయసులో చెంపదెబ్బ కొట్టిన అల్లు రామలింగయ్య.. ఏం జరిగింది..?

సాధారణంగా ప్రతి తల్లీదండ్రులు తమ పిల్లలను గాడిలో పెట్టేందుకు , తప్పు చేస్తే దండించేందుకు చేయి చేసుకోవడం అనేది

Sasivadane: 'శశివదనే' షూటింగ్ పూర్తి

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్‌విఎస్‌ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. మరియు ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా,

Kedarnath chopper crash : ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భక్తుల హెలికాఫ్టర్... ఆరుగురు దుర్మరణం

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాఫ్టర్ మంగళవారం కుప్పకూలింది.

BiggBoss: ‘‘ అప్పుడేం పీకావ్ ’’.. శ్రీహాన్‌కి ఇచ్చిపడేసిన ఇనయా, ఈవారం నామినేషన్స్‌లో 13 మంది

బిగ్‌బాస్ 6 తెలుగు విజయవంతంగా ఏడో వారానికి చేరుకుంది. ఆదివారం సుదీప ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు కాస్త ఎమోషనల్‌ అయ్యారు.

Pawan Kalyan : గేర్ మార్చిన పవన్.. హైదరాబాద్‌కు కాదు, విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బెజవాడకు

వైసీపీ నేతలు జోగి రమేశ్, ఆర్కే రోజా, వైవీ సుబ్బారెడ్డిల కాన్వాయ్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడితో గత రెండు రోజులుగా