ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రీమేక్ కోసం గాయకుడిగా పవన్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆయన తన అభిమానులను మరోసారి ఫిదా చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ మరోసారి గాయకుడి అవతారమెత్తబోతున్నారు. మూడేళ్ల తరువాత పవన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతమైతే ఏక కాలంలో రెండు సినిమాల్లో నటిస్తూ.. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’తో పాటు.. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో కథానాయకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

‘అయ్యప్పనుమ్ కోషియం’ కోసమే పవన్ మరోసారి గాయకుడి అవతారమెత్తనున్నారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఓ పాటపాడనున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ వెల్లడించారు. ‘వకీల్‌సాబ్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌కు సంగీతం అంటే చాలా ఇష్టమని... ఆయన సినిమాలకు సంగీతం అందించాలని ఎప్పటి నుంచో తనకో కోరిక ఉండేదని వెల్లడించారు. ‘వకీల్‌సాబ్‌’తో తన కల నెరవేరిందన్నారు. అలాగే ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌కు కూడా తానే సంగీతం అందిస్తున్నానని తమన్ వెల్లడించారు.

ఈ సినిమాకు సైతం సంగీతం అందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రీమేక్‌ కోసం పవన్‌ ఓ పాట పాడనున్నారని వెల్లడించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వల్లే ‘వకీల్‌సాబ్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ ప్రాజెక్ట్‌లలో తాను భాగమయ్యానని తమన్‌ తెలిపారు. కాగా.. పవన్‌ ఇప్పటికే పలుమార్లు తన పాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ‘తమ్ముడు’లో ‘ఏమ్‌ పిల్ల మాటాడవా’, ‘తాటిచెట్టు ఎక్కలేవు’ అంటూ మెప్పించిన పవన్‌.. ‘అజ్ఞాతవాసి’లో ‘కొడకా కొటేశ్వరరావు’ వరకూ ఎనిమిది పాటలతో పవన్‌ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. ఇక ఇప్పుడు ఈ రీమేక్‌లో పవన్ పాడబోయే పాట ఎలా ఉంటుందో వేచి చూడాలి.