close
Choose your channels

Goutham Nanda Review

Review by IndiaGlitz [ Friday, July 28, 2017 • తెలుగు ]
Goutham Nanda Review
Banner:
Sri Balaji Cine Media
Cast:
Gopichand, Hansika Motwani, Catherine Tresa, Nikithin Dheer (Thangabali),Tanikella Bharani, Mukesh Rishi etc
Direction:
Sampath Nandi
Production:
J Bhagawan, J Pulla Rao

Goutham Nanda Telugu Movie Review

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రమణ మహర్షి రాసిన పుస్తకంలోని ఓ లైన్‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు సంపత్‌నంది తయారు చేసుకున్న కథ 'గౌతమ్‌నంద'. గోపీచంద్‌ అనగానే మనకు యాక్షన్‌ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఈ ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంది అనే ప్రధానాంశంతో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌ రెండు షేడ్స్‌లో నటించాడు. నువ్వేంటి? అనే ప్రతి వ్యక్తి తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు అతని జర్నీ ఎలా సాగింది? ఓ వ్యక్తి తన జీవితంలో డబ్బు కారణంగా ఏం కోల్పోయింది? దాన్ని తిరిగి ఎలా సంపాదించుకున్నాడు? చివరకు ఏం సాధించాడు? గౌతమ్‌నందగా గోపీచంద్‌ ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..

క‌థ:

బిలియ‌నీర్ విష్ణు ప్ర‌సాద్‌(స‌చిన్ ఖేడ్‌ఖ‌ర్‌) త‌న వ్యాపారాల‌ను ఒక్క‌గానొక్క కొడుకు గౌత‌మ్‌(గోపీచంద్‌)కు అప్ప‌చెప్పాల‌ని అనుకుంటూ ఉంటాడు. గౌత‌మ్ ఏమో స్నేహితుల‌తో స‌ర‌దాగా ప్ర‌పంచ యాత్ర చేస్తుంటాడు. మ‌రో వైపు విష్ణు స్నేహితుడు ముద్ర‌(ముకేష్ రుషి) త‌న‌కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన స్నేహితుడిని చూసి ప్రతీకారంతో ర‌గిలిపోతుంటాడు. ముద్ర త‌న‌య ముగ్ధ‌(కేథ‌రిన్‌), గౌత‌మ్‌ను ప్రేమిస్తుంది. ఓ పార్టీలో జ‌రిగిన చిన్న గొడ‌వ కార‌ణంగా త‌న ఐడెంటిటీని వెతుక్కుంటూ గౌత‌మ్ బ‌య‌లుదేరుతాడు. మ‌ధ్య‌లో త‌న‌లాగే ఉండే నంద‌(గోపీచంద్‌)ను క‌లుసుకుంటాడు. నంద దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. త‌ను క‌నిపెట్టిన యాప్‌ను స‌క్సెస్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. నంద‌ను, అత‌ని స్కూల్ మేట్ స్ఫూర్తి(హ‌న్సిక) ప్రేమిస్తుంటుంది. పెళ్లి కావాల్సిన చెల్లెలుంటుంది. ఆమె పెళ్లి చేయాలంటే డబ్బు అవ‌స‌ర‌మై నంద ఇంట‌ర్వ్యూకి వ‌స్తాడు. చేయబోయే ఉద్యోగం న‌చ్చ‌క‌పోవ‌డంతో తిరిగి వ‌చ్చేయాల‌నుకుంటాడు. కానీ ఇంటికి వెళితే తండ్రి ఏమంటాడోన‌ని భ‌య‌ప‌డి చ‌నిపోవాల‌నుకుంటాడు. అలాంటి స‌మ‌యంలోనే నందాకు గౌత‌మ్ ప‌రిచ‌యం అవుతాడు. ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకుంటారు. గౌత‌మ్ స్థానంలోకి నంద‌, నంద ఇంటికి గౌత‌మ్ వెళ్లి నెల‌రోజుల పాటు గ‌డ‌పాల‌నుకుంటారు. అలా వెళ్లిన వారిద్ద‌రి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తీసుకుంటాయి? ఇద్ద‌రి వ్య‌క్తిత్వాల్లో ఎలాంటి మార్పు వ‌స్తుంది?  చివ‌రికి క‌థ ఏ మ‌లుపు తీసుకుంటుంద‌నే విష‌యాన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ప్ల‌స్ పాయింట్స్:

గోపీచంద్ గౌత‌మ్‌, నంద అనే రెండు పాత్ర‌ల్లో చ‌క్క‌టి వేరియేష‌న్స్‌ను చూపించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో నందా, గౌత‌మ్‌గా న‌టించేట‌ప్పుడు చాలా బాగా చేశాడు. ఇక లుక్ విష‌యానికి వ‌స్తే గోపీచంద్ ఇది వ‌ర‌కు త‌న చిత్రాల‌లో క‌న‌ప‌డని విధంగా స్టైలిష్‌గా క‌న‌ప‌డ్డారు. హ‌న్సిక డీ గ్లామ‌ర్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఇక కేథ‌రిన్ బాగా డ‌బ్బున్న అమ్మాయిగా న‌టించింది. బికినీలో యూత్‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి పాత్ర‌లో చంద్ర‌మోహ‌న్‌, త‌ల్లి పాత్ర‌లో సీత‌, అజ‌య్‌, తీన్మార్ స‌త్తి, వెన్నెల‌కిషోర్ అంద‌రూ చ‌క్క‌గా చేశారు. సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ హైలైట్ ప్ర‌తి స‌న్నివేశాన్ని సౌంద‌ర్ తెర‌పై రిచ్‌గా చూపించిన తీరును త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే. థ‌మ‌న్ ట్యూన్స్‌లో బ‌స్తీ సాంగ్ బావుంది. సెకండాఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది.

మైన‌స్ పాయింట్స్:

ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ర‌మ‌ణ మ‌హ‌ర్షి పుస్త‌కం నుండి ఓ లైన్ తీసుకుని దాని నుండి క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు క‌దా, క‌థ ఎలాంటిదో అని తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లిగింది. కానీ స్టైలిష్‌గా ఉండ‌టం  అనే విషయాన్ని ప‌క్క‌న పెట్టి క‌థ న‌డిచే విధానం చూస్తే రాముడు భీముడు, గంగ మంగ వంటి పాత చిత్రాలే గుర్తుకు వ‌చ్చాయి. సెకండాఫ్‌లో చివ‌రి అర్ధ‌గంట సినిమా ఓకే. త‌మ‌న్ అందించిన ట్యూన్స్ ఒక సాంగ్ మిన‌హా మ‌రే ట్యూన్ బాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ‌స్టాఫ్‌లో ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. కామెడి లేదు. వెన్నెల‌కిషోర్‌, తీన్మార్ స‌త్తి కామెడి పేల‌లేదు.

స‌మీక్ష:

రెండు భిన్న‌మైన వ్య‌క్తిత్వాలు, భిన్న వాతావ‌ర‌ణంలో పెరిగిన వ్య‌క్తులు వారి ప్ర‌యాణంలో ఒక‌రి స్థానంలోకి మ‌రొక‌రు వెళితే ఎలా మారిపోయార‌నేదే ప్ర‌ధాన క‌థ‌. ప్ర‌పంచంలోని 196 దేశాల్లోని ప్ర‌జ‌లంద‌రినీ కలిపే కామ‌న్ పాయింట్ డ‌బ్బు. ఈ డబ్బు చుట్టూనే ప్ర‌పంచం తిరుగుతుందనే విష‌యాన్ని సంప‌త్ అండ్ టీం గట్టిగా చెప్పాల‌నుకున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో ఇప్పుడున్న మాన‌వ సంబంధాల‌న్ని డ‌బ్బుతో ముడిప‌డిన‌వేన‌ని సందర్భానుసారం పేర్లు మారినా పేప‌ర్ ఒక‌టేన‌ని డైరెక్ట‌ర్ త‌ను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని తెలివిగా చెప్పించాడు. బ‌లిసినోడికి, లేనోడికి బ‌స్టాండు, రైల్వే స్టేష‌న్ ఒక‌టే కానీ బ్ర‌తుకులే వేరు. నిన్ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డాని కంటే ముందు నిన్ను నువ్వు ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసుకో..ఇలాంటి మంచి డైలాగ్స్ ప్రేక్ష‌కుడిని మెప్పిస్తాయి. జింద‌గీ నా మిలేగా దుబారా పాట‌ను చిత్రీక‌రించిన తీరుతో సినిమాలో ప్ర‌తి సీన్ ఎంతో రిచ్‌గా ఉంది. దీంతో  మేకింగ్‌లో నిర్మాణ విలువ‌లేంటో తెలుస్తాయి. డైలాగ్స్ ఒక‌టి ఆరా బావున్నా, బ‌ల‌మైన ఎమోష‌న్స్ సినిమాలో క‌న‌ప‌డ‌వు. అస‌లు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది హీరో పేదరికాన్ని చూపించిన తీరు చూస్తే, స్వంత ఇల్లు ఉన్న వ్య‌క్తి అంత తిండి కూడా లేని పేద‌రికంలో ఉంటున్నారా అనే డౌట్ వ‌స్తుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి, త‌న కొడుకు మంచి ఉద్యోగం చేయాల‌నుకోవడం మామూలే. మ‌ధ్య త‌ర‌గ‌తి కంటే దిగువ ఉండి చెప్పులు కాకుండా షూలు వేసుకునే హీరో మ‌న తెలుగు సినిమాల్లోనే క‌న‌ప‌డ‌తారు.

మొత్తం మీద సినిమాను ఓసారి చూడొచ్చు

బోట‌మ్ లైన్: ప‌ర్లేద‌నిపించే 'గౌత‌మ్ నంద‌'

Goutham Nanda Review in English Version

Rating: 2.75 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE

Get Breaking News Alerts From IndiaGlitz