సైరాకు షాకిచ్చిన ప్ర‌భుత్వాలు!!

  • IndiaGlitz, [Wednesday,December 18 2019]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. చిరు 151వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. బ్రిటీష్‌వారిని ఎదిరించి తెలుగు పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైంది. తెలుగులో మిన‌హా మరే భాష‌లోనూ సినిమా క‌నీస విజ‌యాన్ని కూడా అందుకోలేదు. నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌కి ఓ ర‌కంగా ఇది నిరాశ‌ను మిగిల్చింద‌నే చెప్పాలి. అస‌లు న‌ష్టాలే ఉన్న ఈ సినిమా వ‌ల్ల ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌కు మ‌రో ర‌కంగా బ్యాండు ప‌డింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. చ‌రిత్ర‌లో దేశం కోసం పోరాడిన వీరుల జీవిత క‌థ‌ల‌ను సినిమాలుగా తెర‌కెక్కిస్తే.. స‌ద‌రు సినిమాల‌కు ప్ర‌భుత్వం ప‌న్నుమిన‌హాయింపును ఇస్తుంది. గ‌తంలో రుద్ర‌మదేవి, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాల‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చింది. ఇప్పుడు అదే కోవ‌లో సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రానికి ప‌న్ను మిన‌హాయింపు ద‌క్కుతుంద‌ని మెగా క్యాంప్ భావించింది. అందుకోసం చిరంజీవి రెండు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను క‌లిశారు, వారితో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. అయితే, రెండు తెలుగు ప్రభుత్వాలు మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ విన్న‌పాల‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ప్ర‌భుత్వంకు కట్టాల్సిన జీఎస్టీ ప‌న్ను మొత్తం భారీగా ప‌డింద‌ట‌. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ ప‌న్ను రూ.20 కోట్ల మేర‌కు చెల్లించాల్సి ఉంద‌ట‌.