close
Choose your channels

గుండెమార్పిడి జరిగిందా..? పవన్‌పై బీజేపీ పరోక్ష వ్యాఖ్యలు!

Wednesday, December 4, 2019 • తెలుగు Comments

గుండెమార్పిడి జరిగిందా..? పవన్‌పై బీజేపీ పరోక్ష వ్యాఖ్యలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అసలు ఆ పార్టీని కార్యకర్తలను ఏం చేయాలనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య బీజేపీకి గట్టిగానే భజన చేస్తున్నాడు. ఇది ఆయన్ను అభిమానించే ఫ్యాన్స్‌కు కార్యకర్తలకు.. మెగాభిమానులకు గత రెండ్రోజులు పవన్ మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు బీజేపీపై విమర్శలు గుప్పించి ‘పాచిపోయినా లడ్డూ..’ అంటూ వెటకారంగా మాట్లాడి.. ఇప్పుడు మాత్రం ఎప్పుడూ లేనంతగా బీజేపీని.. ఆ పార్టీకి చెందిన ప్రధాని మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు పవన్. ఆయన చేస్తున్న పనులు.. మాట్లాడుతున్న మాటలకు జనసైనికులు, మెగాభిమానులు కొందరు ఎలా మాట్లాడాలో..? ఏం మాట్లాడాలో తెలియక ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరైతే జిల్లా స్థాయి నాయకుల సమక్షంలో అటు వైసీపీలోకి.. ఇటు బీజేపీలోకి జంప్ అవుతున్నారు. అయితే తాజాగా బీజేపీపై పవన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల.. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. ఈ సందర్భంగా గతంలో బీజేపీ, నరేంద్ర మోదీ, అమిత్ షా లపై విమర్శలు చేసిన విషయాన్ని ఎంపీ జీవీఎల్ ప్రస్తావించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీలకు చురకలంటించారు. బీజేపీతో తాము ఎప్పుడూ విభేదించలేదని, ఆ పార్టీతోనే కలిసి ఉన్నామని పవన్ కల్యాణ్, టీడీపీ నాయకులు ఈమధ్య చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

గుండెమార్పిడి ఏమన్నా జరిగిందేమో..!?
‘కేంద్ర పెద్దలు, అమిత్ షా అంటే నాకు గౌరవమని చెబుతున్న టీడీపీ నాయకులే ఆయనపై గతంలో రాళ్లు వేయించారు. నరేంద్ర మోదీని, అమిత్ షాను దుర్భాషలాడిన వాళ్లే ఇప్పుడు వినసొంపుగా వుండే వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా వాళ్లకు గుండెమార్పిడి ఏమన్నా జరిగిందేమో..? ’అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి జీవీఎల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ మేరకు ఆయన మీడియా ముందుకొచ్చారు. బీజేపీ విధానాలు నచ్చి, తమతో ఏకీభవించి విలీనానికి వచ్చే ఏ ప్రాంతీయపార్టీని అయినా తాము స్వాగతిస్తామన్నారు. ఈ విషయమై చొరవ తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్‌కు ఒకింత ఆయన హామీ ఇచ్చారు.

అలా అనుకుంటే పొరాపాటే పవన్!
‘మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం అవసరం కోసం బీజేపీని వాడుకుని, రాజకీయ అస్త్రాన్ని సందిద్దామనుకుంటే కనుక అది గ్రహించలేని పరిస్థితిలో బీజేపీ లేదని అనుకోవద్దు. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్‌ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.. కలిసి పనిచేసేలా మేమందరం ప్రయత్నిస్తాం’ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ కొన్ని సలహాలు, సూచనలు.. మరికొన్ని వార్నింగ్‌లు ఇచ్చారు. అయితే జీవీఎల్ వ్యాఖ్యలకు జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz