Download App

Happy Wedding Review

వ‌యా వెబ్ సీరీస్‌ల ద్వారా వెండితెర‌మీద‌కు ప‌రిచ‌య‌మైన మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల‌. త‌న‌కు స‌రిపోయే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ ఇంటిల్లిపాదినీ మెప్పించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తోంది. అలాగే యువ‌త‌కు, ఫ్యామిలీస్‌కి ద‌గ్గ‌ర‌య్యే పాత్ర‌ల‌తో మెప్పిస్తున్నారు ఎం.ఎస్‌.రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్‌. వీరిద్ద‌రు క‌లిసి చేసిన సినిమా `హ్యాపీ వెడ్డింగ్‌`. కొత్త ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా `హ్యాపీ వెడ్డింగ్‌`లాగానే అనిపించిందా?  లేదా... అది బాగోలేదు.. ఇది బాగోలేదు అని గొణుక్కునేలా ఉందా... జ‌స్ట్ గో త్రూ..

క‌థ‌:

ఆనంద్ (సుమంత్ అశ్విన్‌) ర‌చ‌యిత‌. కొన్ని జింగిల్స్ కోసం ట్యూన్లు కూడా క‌డుతుంటాడు. విజ‌య‌వాడ‌లో ఉంటాడు. అత‌నికి హైద‌రాబాద్ అమ్మాయి అక్ష‌ర (నిహారిక‌)కు ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి కుదురుతుంది. అయితే అప్ప‌టికి పెళ్లికి అక్ష‌ర సిద్ధంగా ఉండ‌దు. పైగా ఆ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌తో చెప్ప‌దు. త‌న ప్రేమించిన రోజు ఆనంద్ ఎలా ఉన్నాడో, జీవితాంతం అలాగే ఉండాల‌ని కోరుకుంటుంది. జీవితంలో త‌నవైన ఇష్టాయిష్టాల‌, వృత్తిప‌ర‌మైన అంశాల వ‌ల్ల ఆనంద్ కొన్నిసార్లు ఆమెకు అంత అటెన్ష‌న్ పే చేయ‌లేక‌పోతాడు. స‌రిగా ఆ స‌మ‌యంలోనే అక్ష‌ర‌కు విజ‌య్ (రాజా) గుర్తుకొస్తాడు. విజ‌య్ ఎవ‌రు? అత‌ని గురించి అక్ష‌ర ఎలా ఆలోచిస్తుంది? వ‌ఇజ‌య్ గురించి ఆనంద్‌కి తెలుసా?  తెలిస్తే ఎలా అంగీక‌రించాడు? ఆ త‌ర్వాత ఏమైంది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ప్ల‌స్ పాయింట్లు:

క‌థ‌గా ఇది చాలా సున్నిత‌మైన క‌థ‌. ఒక‌మ్మాయి మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను చెప్పే సినిమా. పాట‌లు కూడా క‌థ‌ను ముందుకు న‌డిపించే మాంటేజ్ సాంగ్స్. అందులో సాహిత్యం బావున్నా.. ట్యూన్లు మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా అనిపించ‌వు. సినిమా వ‌ర‌కే అవి ప‌రిమితం. నీహారిక డ్ర‌స్సింగ్ కూడా నేటి అమ్మాయిల‌కు త‌గ్గ‌ట్టుగానే ట్రెండీగా, ప‌ద్ధ‌తిగా అనిపించింది. మ‌నుషులంద‌రూ మామూలుగా మంచివారే, కాక‌పోతే సంద‌ర్భాలు వారిలో మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను క‌లిగిస్తాయని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. కెమెరా ప‌నిత‌నం, రీరికార్డింగ్ బావున్నాయి. న‌టీన‌టులు త‌మ ప‌రిధిలో బాగానే న‌టించారు. డైలాగులు బావున్నాయి. అక్క‌డ‌క్క‌డా సెంటిమెంట్ పండింది.

మైన‌స్ పాయింట్లు:

ద‌ర్శ‌కుడి అనుభ‌వ‌లేమి అనేది సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. హీరో కుటుంబాన్ని, హీరోయిన్ కుటుంబాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో స‌రైన ఎమోష‌న్స్ ని రాబ‌ట్టుకోలేక‌పోయార‌న్న‌ది వాస్త‌వం. హీరో, హీరోయిన్ మ‌ధ్య దూరం పెర‌గ‌డానికి, నాయిక పున‌రాలోచ‌న‌లో ప‌డ‌టానికి కాసింత మంచి స‌న్నివేశాల‌ను రాసుకుని ఉంటే బావుండేది. లొకేష‌న్ల ప‌రంగా కూడా ఇంకాస్త వైవిధ్యాన్ని చూపించి ఉంటే బావుండేదేమో. చాలా స‌న్నివేశాలు పాత‌గా అనిపించాయి.

విశ్లేష‌ణ‌:

పుట్టింట్లో ఉన్న స్వాతంత్ర్యం అత్తింట్లో ఉంటుందా?  పెళ్ల‌య్యాక ఎంత బాగా చూసుకున్నా అత్త మామ‌లు.. త‌ల్లిదండ్రులు కాలేరుగా? అప్పుడే పెళ్లి ఎందుకు? ప‌్రేమించిన‌ప్పుడు వెంట‌ప‌డే భ‌ర్త పెళ్ల‌య్యాక కూడా అదే అటెన్ష‌న్‌ని చూపిస్తాడా? ఒక‌వేళ చూపించ‌క‌పోతే? ఇప్ప‌టికీ చేజారింది లేదు.. ఒక్క‌సారి చివ‌రి అవ‌కాశం ఇవ్వు అని బ‌తిమ‌లాడుకునే వ్య‌క్తిని కాద‌ని ఇంకో వ్య‌క్తిని చేసుకోవ‌డం క‌రెక్టేనా?... ఇన్ని అనుమానాల మ‌ధ్య ఒక‌మ్మాయి పెళ్లి చేసుకుంటున్న‌ప్పుడు.. ఆ తతంగాన్ని చూపిస్తున్న‌ప్పుడు.. ప్ర‌తి స‌న్నివేశాన్నీ హృద్యంగా, ఉత్కంఠ‌గా తీసే అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు కొత్త‌వాడు కావ‌డం వ‌ల్ల‌నే ఏమో ఎమోష‌న్స్ ని స‌రిగా ప‌ట్టుకోలేక‌పోయాడు. స్క్రీన్‌లో న‌లుగురిని నిల‌బెట్టి, ఎమోష‌న్స్ ని పండించాల‌నుకుంటే అది పండ‌లేద‌న్న‌దే వాస్త‌వం. ఇంద్ర‌జ పాత్ర మెప్పిస్తుంది. కామెడీ లేదు. అక్క‌డ‌క్క‌డా డైలాగులు బావున్నాయి. కొత్త స‌న్నివేశాలు, బిగువైన స్క్రీన్ ప్లే, రేసీ ఎడిటింగ్ గ‌నుకు ఉండి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యే కెపాసిటీ ఉన్న సినిమా ఇది.

బాట‌మ్ లైన్‌:   క‌ళ త‌ప్పిన 'హ్యాపీ వెడ్డింగ్'

Happy Wedding Movie Review in English

Rating : 2.5 / 5.0