close
Choose your channels

హరీశ్‌‌రావు కీలక నిర్ణయం.. మార్చి15న రాజీనామా..!?

Monday, February 11, 2019 • తెలుగు Comments

హరీశ్‌‌రావు కీలక నిర్ణయం.. మార్చి15న రాజీనామా..!?తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మార్చి 15న రాజీనామా చేయనున్నారా..? ఇన్ని రోజులు ‘కట్టప్ప’లా సీఎం కేసీఆర్‌‌ను కాపాడుతూ వస్తున్న హరీశ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమయ్యే పరిస్థితులు మెండుగానే ఉన్నాయని అర్థమవుతోంది. అసలు హరీశ్ రాజీనామా ఎందుకు చేయాలనుకున్నారు..? రాజీనామా తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు..? అసలు ఆయనపార్టీలో ఉంటారా..? బయటికెళ్తారా..? లేకుంటే టీఆర్ఎస్ తరఫునే ఎంపీగా పోటీ చేస్తారా..? అని ఇలా పలురకాలుగా ఆయన అభిమానులు, అనుచరులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నాయట.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హరీశ్‌‌ రావు గురించి పలురకాలుగా పుకార్లు వస్తున్నాయి. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్.. హరీశ్‌‌ను పట్టించుకోవట్లేదని.. ఆయనకు మంత్రి ఇవ్వట్లేదని.. కేటీఆర్‌‌ను సీఎంను చేయడానికి హరీశ్ అడ్డుకాకూడదని పనిగట్టుకుని కేసీఆర్ పక్కనపెడుతున్నారని.. రకారకాలు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒకానొక సందర్భంలో టీఆర్ఎస్‌ నుంచి హరీశ్‌‌ను పొమ్మనలేక పొగబెడుతున్నారని.. దీంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా కొన్ని వెబ్‌‌సైట్స్ వార్తలు కుప్పలు తెప్పలుగా రాశాయి. అయితే తాజాగా కేసీఆర్, హరీశ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే బాంబు పేల్చడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.

కలకలం రేపుతున్న రమ్యారావు వ్యాఖ్యలు! 
కేసీఆర్‌‌ కుటుంబం అంతా దాదాపు టీఆర్ఎస్‌‌లో కొనసాగుతున్నప్పటికీ.. సీఎం అన్న కుమార్తె రమ్యారావు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె టీపీసీసీ అధికార ప్రతినిధి ‌కొనసాగుతున్నారు. ఈమె మేనత్త కుమారుల్లో ఒకరు హరీశ్. కాగా కేసీఆర్‌‌పైనే విమర్శలు ఎక్కుపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా హరీశ్‌‌ను టార్గెట్ చేసుకున్న రమ్యా.. ఆయన గురించి ఓ సంచలన విషయం చెప్పి హడావుడి చేసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె ఇలా బాంబు పేల్చడంతో అవునా.. నిజమేనా అంటూ హరీశ్ కుటుంబీకులు ఆశ్చర్యపోయారట. ‘తాజా తెలంగాణ’ అనే వాట్సాప్ గ్రూప్ పేరుతో రమ్యా చేసిన పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

అసలేంటి ఆ సంగతి..!
"మరో నాలుగు నెలల్లో.. అనగా మే నెలలో హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్.. ఆ ఎన్నికల్లో హరీశ్ సతీమణి తన్నీరు శ్రీనిత పోటీ చేయబోతున్నారు" అనేదే ఆ వాట్సాప్ సందేశం సారాంశం. ఎవరైనా పార్టీకి రాజీనామా చేస్తే ఎన్నికల కమిషన్ నియమ నిబంధనాల ప్రకారం ఒక ఆరు నెలల్లో పరిస్థితిని బట్టి ఉపఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఇక విషయానికొస్తే సిద్దిపేటలో ఉపఎన్నిక జరగాలంటే ఆయన రాజీనామా చేయాల్సిందే.. మరి. అయితే ఆయన నిజంగానే రాజీనామా చేస్తానని కుటుంబీకులతో చర్చించారా..? లేకుంటే ఒక రాయేస్తో పోలా తగులుద్దేమో చూద్దామని రమ్యా ఇలా చేశారా..? అనేది తెలియరాలేదు కానీ.. ఆమె సందేశానికి మాత్రం సరిగ్గా ఇలా కేబినెట్‌‌ విస్తరణకు ముందు ఇలాంటి వార్తలు రావడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి.

ఈ పుకార్లు అక్షరాలా నిజం కానున్నాయా..!
అవును రమ్య చెబుతున్నట్లుగా నిజంగానే హరీశ్ రాజీనామా చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయ్. అయితే ఎమ్మెల్యే పదవి కి మాత్రమే మార్చి 15న రాజీనామా చేసి ఆ తర్వాత లోక్‌‌సభ ఎన్నికల్లో హరీశ్ పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కేసీఆర్ రాజీనామా చేసి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని వార్తలు వినవస్తున్నాయి. అయితే వీరిద్దరూ కూడా రాజీనామా చేసి ఢిల్లీ కేంద్రంగా జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సమాచారం. అందుకే రాష్ట్రం మొత్తం కేటీఆర్‌‌కు అప్పగించి.. హరీశ్, కేసీఆర్ ఇద్దరూ ఫెడరల్ ఫ్రంట్‌‌ను చూసుకుంటారని తెలుస్తోంది. ఇలా ఇద్దరి రాజీనామా అక్షరాలా నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!

ఎన్నికల ముందు ఇలాగే పలుమార్లు ఇలానే పుకార్లు రావడంతో క్లారిటీ ఇచ్చి ప్రత్యర్థుల నోళ్లు మూయించిన హరీశ్.. కుటుంబంలోని వ్యక్తయిన రమ్య ఆరోపణలపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అభిమానులు, కార్యకర్తల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టాల్సిన అవసరం అంతకంటే ఎక్కువే ఉంది. ఈ పుకార్లన్నింటీకి ఫుల్‌స్టాప్ పడలన్నా.. నిజానిజాలేంటో తెలియాలన్నా.. ‘కట్టప్ప’ హరీశ్ రావు మీడియా ముందుకు రావాల్సిందే మరి. 

Get Breaking News Alerts From IndiaGlitz