Mahi V Raghav: రాయలసీమకు ఏమైనా చేశారా? ఇండస్ట్రీపై 'యాత్ర2' దర్శకుడు విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైయస్ జగన్ జీవితంలో జరిగిన ఘటనల గురించి తెరకెక్కించిన 'యాత్ర-2' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ చిత్రం దర్శకుడు మహి వి రాఘవ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా విడుదల తర్వాత మహికి ప్రభుత్వం స్టూడియో నిర్మాణం కోసం మదనపల్లిలో రెండెకరాల స్థలం కట్టబెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై ఆయన స్పందిస్తూ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ రాయలసీమ కోసం ఏం చేసింది? అని ప్రశ్నించారు.
ఆయన మాట్లాడుతూ "నాది రాయలసీమ. నా ప్రాంత అభివృద్ధి కోసం ఒక మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నాను. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే నేను హైదరాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగుతాను. అంతేగాని మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను. నేను మదనపల్లిలోనే పుట్టి పెరిగాను, అక్కడే చదివాను. నా ప్రాజెక్ట్స్ పాఠశాల, యాత్ర 2, సిద్ధాలోకం, సైతాన్ వెబ్ సిరీస్‌లను రాయలసీమలోనే షూట్ చేశాను. ఈ ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశం కోసమే అక్కడ స్టూడియో కట్టాలనుకుంటున్నా" అని వివరించారు.
"మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల లాడ్జీలు, హోటల్స్, భోజనాలు, జూనియర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులకు ఉపయోగం ఉంటుంది. అయినా నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎకరాలు అడగలేదు. కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నాను. సినీ పరిశ్రమలో రాయలసీమలో షూటింగ్స్ చేయటానికి ఆసక్తి చూపించరు. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా? మీరు చేయరు.. చేసేవాడిని చేయనివ్వరు. నేను నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో, అక్కడి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు. ఓ వర్గం మీడియా దీనిని పెద్ద విషయంగా చూపిస్తున్నారు. వాళ్ల ప్రియమైన ప్రభుత్వం ఎక్కడిక్కడో ఎవరెవరికో భూములు కట్టబెట్టింది. దీని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహి వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి.
కాగా 'యాత్ర2’ విడుదలకు ముందే తనకు మదనపల్లిలోని హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాలు ఇవ్వాలని, స్టూడియోను ఏర్పాటు చేసుకుంటానని మూవీ దర్శకుడు మహి వీ రాఘవ ప్రభుత్వానికి లేఖ రాశాడు. దీంతో రెండు ఎకరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు బయటకు పొక్కడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇది క్విడ్‌ప్రో కిందకు వస్తుందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments