close
Choose your channels

Chintamani Natakam : రఘురామకు చుక్కెదురు.. ‘‘ చింతామణి ’’పై ఏపీ సర్కార్ నిషేధం, స్టేకు హైకోర్టు నో

Friday, June 24, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు ప్రజల ఆల్‌టైమ్ ఫేవరేట్ నాటకాల్లో ఒకటైన చింతామణి నాటకంపై ఏపీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే సమయంలో చింతామణి నాటకానికి సంబంధించిన పుస్తకం తెలుగు, అనువదించిన ఇంగ్లీష్‌ కాపీని తమకు సమర్పించాలని ఆదేశించింది. చింతామణి నాటకాన్ని నిషేదిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓను సవాల్ చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, కళాకారులు హైకోర్టులో పిటీషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కోర్టుకెక్కిన రఘురామ, కళాకారులు:

రఘురామకృష్ణంరాజు తరపున ఉమేష్‌ చంద్ర, ఆర్టిస్ట్‌ల తరపున న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌‌లు పిటిషన్‌లు దాఖలు చేశారు. పుస్తకాన్ని నిషేదించకుండా, నాటకాన్ని నిషేధించడమేంటని న్యాయవాది ఉమేష్‌చంద్ర కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. ఇది వాక్‌స్వాతంత్రాన్ని హరించడమేనని... కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యతీసుకుందని ఉమేష్‌ వాదించారు.

కళాకారుల ఉపాధి పోతుందన్న న్యాయవాది:

అయితే రఘురామకృష్ణంరాజుకు ఈ పిటీషన్‌ వేసేందుకు లోకల్‌ స్టాండ్‌ లేదని ఆర్యవైశ్య సంఘం తరపు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ప్రజా ప్రతినిధిగా, ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే హక్కు రఘురామకృష్ణంరాజుకు ఉందని ఉమేష్‌చంద్ర వ్యాఖ్యానించారు. శ్రవణ్‌ కుమార్‌ తరపున ఆయన జూనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టిస్ట్‌లు తమ జీవన హక్కును కోల్పోతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. చింతామణి నాటకం పుస్తకాన్ని తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ... విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.

ఇటీవలే చింతామణిపై నిషేధం:

ఇకపోతే.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘‘చింతామణి’’ నాటకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిని నిషేధించాలని ఆర్య వైశ్య నేతలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆర్యవైశ్య వర్గం ఆగ్రహం:

కాగా తెలుగు నాటక రంగంలో ‘‘చింతామణి’’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం తదితర కీలక పాత్రలు ఉన్నాయి . అయితే సుబ్బిశెట్టి అనే పాత్ర చింతామణి అనే మహిళ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.