close
Choose your channels

IAS Krishna Teja:కలెక్టర్ అంకుల్.. తెలుగు ఐఏఎస్‌పై కేరళ వాసుల అభిమానం, వేణుగానంతో ఫేర్‌వెల్

Friday, March 17, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జిల్లా కలెక్టర్.. భారతదేశంలోని పాలనా వ్యవస్థలో ఆయన పాత్ర కీలకమైనది. ఒక జిల్లాకు కలెక్టర్ గుండెకాయ లాంటి వాడు. కనుసైగతో మొత్తం యంత్రాంగాన్ని శాసించగల పవర్ ఆయన సొంతం. జిల్లాలో కలెక్టర్‌కు తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనదంటే అతిశయోక్తి కాదు. ఈ కారణాల చేత కలెక్టర్‌ను జిల్లా వరకు మకుటం లేని మహారాజుగా చెబుతారు. బ్రిటీష్ వారి హయాంలో ప్రారంభమైన కలెక్టర్ల వ్యవస్థకు నానాటికీ ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో నాటి నుంచి నేటి వరకు ఎందరో కలెక్టర్లు జిల్లా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించి చరిత్రలో నిలిచిపోయారు. అభివృద్ధి, సంక్షేమం మేళవింపుతో పాలన సాగిస్తూ పలువురు కలెక్టర్లు ప్రజల హృదయాలలో స్థానం సంపాదించారు.

ఫ్లూటు వాయిస్తూ కలెక్టర్‌కు వీడ్కోలు :

అలాంటి ఒక కలెక్టర్ బదిలీపై వెళ్తుండటాన్ని ఆ ప్రాంత ప్రజలు తట్టుకోలేకపోయారు. తమకు ఎంతో చేసిన ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతేకాదు ఆ కలెక్టర్‌ను ఇంకొంతకాలం తమతోనే వుంచాలని ప్రభుత్వాన్ని కోరారు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం అలెప్పీ జిల్లా కలెక్టర్‌ కృష్ణ తేజను ఆ రాష్ట్ర ప్రభుత్వం త్రిసూర్‌కు బదిలీ చేసింది. ఈ వార్త తెలిసి అలెప్పీ జిల్లా వాసులు తట్టుకోలేకపోయారు. ఆయనను ఘనంగా సాగనంపాలని భావించిన ప్రముఖ ఫ్లూటిస్ట్ జోషీ .. కలెక్టర్ కార్యాలయంలో కృష్ణతేజను కలిసి వేణువు వాయిస్తూ, ఘనంగా వీడ్కోలు పలికారు. తనపై జోషి చూపిస్తున్న అభిమానానికి భావోద్వేగానికి గురైన కలెక్టర్ కృష్ణతేజ అతనిని హత్తుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

వరదలు, కరోనా సమయంలో కీలకపాత్ర :

ఇకపోతే.. కలెక్టర్ కృష్ణతేజ తెలుగువారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన 2018 కేరళ వరదల సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్‌గా వున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఆయనను పిల్లలంతా కలెక్టర్ అంకుల్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువుకు ‘‘వీ ఆర్ ఫర్ అలెప్పీ’’ అనే ప్రాజెక్ట్‌ ద్వారా స్పాన్సర్ల నుంచి విరాళాలు సేకరించి వారిని దారికి చేర్చారు. అలాగే ‘‘చిల్డ్రన్ ఫర్ అలెప్పీ’’ ప్రాజెక్ట్ ద్వారా 3,600 పేద కుటుంబాల ఆకలిని తీర్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం ధనవంతులు, సంపన్నుల పిల్లలు స్వచ్ఛందంగా ఆహార ఉత్పత్తులను పాఠశాలలకు తీసుకొస్తారు. అనంతరం వాటిని జిల్లా అధికారులు పేద విద్యార్ధులకు అందజేస్తారు. ఇంతగా అలెప్పీ జిల్లాపై ప్రభావం చూపిన కలెక్టర్ కృష్ణ తేజ తమను విడిచి వెళ్లిపోతుండటాన్ని అలెప్పీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.