ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తే పరిస్థితేంటి..: హైకోర్ట్

  • IndiaGlitz, [Tuesday,October 15 2019]

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడింది. కార్మికులు వెంటనే సమ్మెను విరమించాలని.. అటు ప్రభుత్వం కూడా కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని సూచించింది. ఆర్టీసీకి వెంటనే ఎండీని నియమించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పండుగ సమయంలో సమ్మె చేయడం సమంజసమేనా? అని కార్మికులపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. నిరసనను వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. వెంటనే సమ్మెను విరమించి, చర్చలకు వెళ్లాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 18కి హైకోర్టు వాయిదా వేసింది.

ఎస్మా ప్రయోగిస్తే ఏంటి పరిస్థితి!

అంతటితో ఆగని హైకోర్టు.. ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన కార్మికుల తరపు న్యాయవాది.. చాలా కాలంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ కూడా లేరని.. కార్మికులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని, ఆఖరి అస్త్రంగానే సమ్మెకు దిగామని తెలిపారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ, ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినా ఫలితం రాలేదని వ్యాఖ్యానించింది.

నివేదిక ఇవ్వండి!

ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని తెలిపారు. సమ్మెపై రెండు రోజుల్లో ప్రభుత్వం పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించింది.