‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’కు భారీ ఆదరణ.. దీంతో కొందరేం చేశారంటే..

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి భారీగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడానికి కూడా లేకుండా పబ్లిష్ అయిన పుస్తకాలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడై పోయాయి. కాగా ఈ పుస్తకంలో విజయమ్మ వెల్లడించిన కొన్ని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయనే చర్చ బాగా నడుస్తోంది. దీంతో ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవాలని ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దానిని పీడీఎఫ్‌లో చేసి ఆ ఫైల్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

‘నాలో.. నాతో.. వైయస్సార్‌’ పుస్తకాన్ని పీడీఎఫ్ చేయడంపై లోక్‌సభ సభ్యులు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నాలో.. నాతో.. వైయస్సార్‌’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మగారు రాసిన పుస్తకానికి, దీనికీ సంబంధంలేదు. ఎమెస్కో పబ్లిషర్స్‌ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకం.
ఈ పుస్తకంలోని అంశాలు.. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న పీడీఎఫ్‌ ఫైల్‌లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయి. దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్‌ చేస్తున్నారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గారికి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్‌ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని కోరుతున్నాను’’ అని

వై.వి.సుబ్బారెడ్డి
పేర్కొన్నారు.