close
Choose your channels

జగన్‌కు ప్రేమాలయం కట్టుకోండంటూ విరుచుకుపడిన రఘురామరాజు

Thursday, August 6, 2020 • తెలుగు Comments

కేంద్రం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వై కేటగిరి భద్రతను కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన వైసీపీని అంశాల వారీగా ఏకిపారేశారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజ నేపథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు, ఎస్పీబీసీలో లైవ్ టెలికాస్ట్ చేయమన్నా చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న వారిని ఎలా రాజీనామా చేయమంటారు అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారన్నారు. తనను నియోజకవర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నారని కాబట్టి బొత్స వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకోవాలని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

జగన్‌కు గుడి కట్టడాన్ని హిందువుగా వ్యతిరేకిస్తున్నా..

ఎమ్మెల్యే తలారీ వెంకట రమణ.. సీఎం జగన్‌కు గుడి కట్టడాన్ని హిందువుగా వ్యతిరేకిస్తున్నా. జగన్‌కు చర్చి కట్టుకోండి.. ప్రేమాలయం కట్టుకోండి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య ఇది. హిందు సంస్కృతిని ముఖ్యమంత్రి దెబ్బతీయవద్దు. ఎదిగే కొద్దీ ఒదిగేలా ఉండాలి. అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా జగన్ దేవాలయానికి భూమి పూజ చేయడం ఎబ్బెట్టుగా ఉంది. ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించాలి

పేరు చివర రెడ్డి అని ఉన్నవారు అసభ్యంగా మాట్లాడుతున్నారు..

పేరు చివర రెడ్డి అని పేరున్న వారు అసభ్య పదజాలం వాడుతున్నారు. అమరావతిలో రాజధానిని కపాడమంటూ మహిళలు గాంధేయ మార్గంలో నిరసన తెలియజేస్తుంటే  వారిని కుక్కలతో పోలుస్తూ సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. పేరు చివర రెండక్షరాలు ఉన్న వ్యక్తులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కుక్కలు వేట కుక్కలై తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాజధాని తరలింపు వల్ల చనిపోయిన వారిని ముఖ్యమంత్రి పరామర్శించాలి.

పార్లమెంటు సభ్యుడిగా మనోధైర్య యాత్ర చేపట్టబోతున్నా.

రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెబుతా. ముఖ్యమంత్రికి చెప్తే మనో ధైర్య యాత్ర చేయడానికి ఆయన సమయం ఇవ్వరు కదా.విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది.. విభజన చట్టంలో ఉన్న అంశాల ఆధారంగానే కోర్టులకు వెళ్లారు. విభజన చట్టంలో రాజధాని ఆని మాత్రమే ఉంది. రాజధానులు అని లేదు. గత ముఖ్యమంత్రి అందరితో చర్చించి సీఆర్డీఏ చట్టం తీసుకువచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదు. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అమరావతి రాజధానికి న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి పోరాటం కేంద్రం తీసుకువచ్చిన చట్టంతో ముడిపడి ఉంది. ప్రజలెవరూ అధైర్యపడవద్దు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది

క్యాంప్ ఆఫీస్ ఒకచోట.. లేజిస్లేటివ్ క్యాపిటల్ మరోచోట పెట్టుకోండి...

అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలి. అమరావతిలో ఇల్లు కట్టుకున్నాక జగన్‌కు కలిసి వచ్చింది. కావాలంటే క్యాంప్ ఆఫీస్ ఒకచోట.. లేజిస్లేటివ్ క్యాపిటల్ మరోచోట పెట్టుకోండి. విశాఖ వాసులు రాజధానిని వద్దనుకుంటున్నారు. చేతులు జోడించి వేడుకుంటున్నా రాజధానిని మార్చవద్దు. నేను పార్టీ విధేయుడిని. ముఖ్యమంత్రిని గౌరవిస్తా. భద్రత వచ్చింది కాబట్టి నా నియోజకవర్గానికి వెళ్తా. పార్లమెంటు ఉన్నపుడు రెండు రోజులు, లేనపుడు వారానికి మూడు నాలుగు రోజులు నియోజకర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటా.

ప్రజల ముక్కుల్లో కరోనా పెడుతున్నారా?

ఏపీలో కరోనా రికార్డులు బద్దలు కొట్టుకుంటున్నాం. ఆళ్ల నాని గారు కరోనా టెస్టులు చేస్తున్నారు.. కాబట్టి కేసులు వస్తున్నాయంటున్నారు. అలా ఎలా అంటారు..? రాష్ట్రంలో ప్రజల ముక్కుల్లో కరోనా పెడుతున్నారా? కంగారు పడవద్దని చెబుతున్నారు.. కంగారు పడాల్సిన అవసరం ఉంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz