ఎల్.వి.ప్రసాద్ మనవడిపై ఇళయరాజా ఫిర్యాదు
తనను బెదిరిస్తున్నారని, తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రముఖ సంస్థ ప్రసాద్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు ఎల్.వి.ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై పోలీసులకు తన మేనేజర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అసలు గొడవేంటి? అనే వివరాల్లోకెళ్తే.. ప్రసాద్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు ఎల్.వి.ప్రసాద్ అప్పట్లో ఇళయరాజాకు తన చెన్నై స్టూడియోలో ఓ రీరికార్డింగ్ రూమ్‌ను ఇచ్చారు. ఈ విషయంపై రమేశ్ ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడలేదు. అయితే ఎల్.వి.ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ మాత్రం ఇళయరాజాను స్టూడియో ఖాళీ చేయాలంటూ పేచీ పెట్టారు. కొన్నిరోజుల క్రితం తన స్టూడియోలో సాయిప్రసాద్ మనుషులు ప్రవేశించి తన వాయిద్య పరికరాలను తీసుకెళ్లి ఇతరులకు అమ్మేశారంటూ ఇళయరాజా ఆయనపై కేసు పెట్టారు.
ఇప్పుడు తనను సాయిప్రసాద్ బెదిరిస్తున్నారంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇళయరాజా. తాను ఇది వరకు పెట్టిన కేసు కోర్టులో ఉండగానే తన నుండి దౌర్జన్యంగా స్టూడియోను ఆక్రమించుకోవాలని చూస్తున్నారంటూ ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారంపై ఎంత వరకు వెళుతుందో చూడాలి.